Hyderabad Traffic Police: హైదరాబాదులో డ్రంక్ అండ్ డ్రైవ్... వందల సంఖ్యలో దొరికిపోయారు!

Hyderabad Traffic Police Crackdown on Drunk Driving Hundreds Caught
  • వారాంతపు స్పెషల్ డ్రైవ్‌లో 787 మంది మందుబాబులు పట్టివేత
  • హైదరాబాద్ లిమిట్స్‌లో 506, సైబరాబాద్‌లో 281 కేసులు నమోదు
  • పట్టుబడిన వారిలో అత్యధికంగా బైక్ రైడర్లే ఉన్నట్టు వెల్లడి
  • ప్రమాదాలకు కారణమైతే భారతీయ న్యాయ సంహిత కింద పదేళ్ల జైలు
రోడ్డు భద్రతే లక్ష్యంగా హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వారాంతంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో భారీ సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో చేపట్టిన ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న మొత్తం 787 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 506 మంది పట్టుబడగా.. ఇందులో అత్యధికంగా 401 మంది ద్విచక్ర వాహనదారులే ఉండటం గమనార్హం. అలాగే 47 మంది ఆటో డ్రైవర్లు, 57 మంది కార్లు, ఇతర వాహనాల డ్రైవర్లు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ దొరికిపోయారు. వీరిలో బ్లడ్ ఆల్కహాల్ గాఢత (బీఏసీ) స్థాయి 300 పాయింట్లు దాటిన వారు కూడా 10 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. మరోవైపు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో 281 మంది పట్టుబడ్డారు. ఇక్కడ కూడా 224 మంది బైక్ రైడర్లే ఉన్నారు.

గత వారం (ఫిబ్రవరి 23-28) కోర్టుల్లో హాజరుపరిచిన వారిలో 13 మందికి జైలు శిక్ష పడగా, 5 మందికి జరిమానాతో పాటు సామాజిక సేవ శిక్ష విధించారు. మిగిలిన 200 మందికి జరిమానాలు విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై జీరో టోలరెన్స్ ఉంటుందని జాయింట్ సీపీ స్పష్టం చేశారు. ఎవరైనా మద్యం మత్తులో వాహనం నడిపి ప్రాణాంతక ప్రమాదాలకు కారణమైతే.. కొత్త చట్టం ప్రకారం భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 105 కింద పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.
Hyderabad Traffic Police
Drunk and Drive Hyderabad
Hyderabad
Cyberabad
Traffic Police
Road Safety
BAC
Indian Penal Code

More Telugu News