PV Sindhu: ఇరాన్ ఉద్రిక్తతలు... దుబాయ్ ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన సింధు... వెన్నులో వణుకుపుడుతోందంటూ ట్వీట్

PV Sindhu Stranded in Dubai Airport Due to Iran Tensions
  • ఆల్ ఇంగ్లాండ్ టోర్నీకి వెళ్తుండగా పీవీ సింధుకు ఊహించని అనుభవం
  • మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణంతో దుబాయ్‌లో నిలిచిన విమానాలు
  • ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాస్తున్నానంటూ సింధు వీడియో పోస్ట్
  • సింధుతో నిత్యం టచ్‌లో ఉన్నామన్న బ్యాడ్మింటన్ అసోసియేషన్
  • ఇప్పటికే బర్మింగ్‌హామ్ చేరుకున్న సాత్విక్-చిరాగ్ జోడి
రెండు సార్లు ఒలింపిక్ మెడల్ సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ప్రయాణంలో ఊహించని అనుభవం ఎదురైంది. శనివారం ఆమె దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయింది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడంతో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ట్రాన్సిట్ కోసం దుబాయ్ చేరిన సింధు అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది.

దీనికి సంబంధించి సింధు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఎయిర్‌పోర్టు మొత్తం ప్రయాణికులతో కిక్కిరిసిపోవడం, తదుపరి అప్డేట్ కోసం అందరూ ఎదురుచూస్తుండటం ఆ వీడియోలో కనిపిస్తోంది. "తదుపరి ప్రకటన వచ్చేవరకు అన్ని విమానాలు రద్దు" అని సింధు పేర్కొంది. అంతేకాదు, ఆమె ఎక్స్ లోనూ తన స్పందన వెలిబుచ్చింది.

"ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏమీ అర్థం కావడం లేదు. నా కళ్ల ముందే ఆకాశంలో క్షిపణి దాడులు, పేలుళ్ల శబ్దాలు వింటుంటే వెన్నులో వణుకు పుడుతోంది. సోషల్ మీడియాలో, వార్తల్లో వస్తున్న భయానక వీడియోలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. దుబాయ్ అంటే నాకు ఎంతో ఇష్టం.. ఎప్పుడూ ప్రశాంతంగా, ఎంతో సేఫ్ గా ఉండే ఈ నగరంలో ఇలాంటి యుద్ధ వాతావరణం చూస్తానని కలలో కూడా అనుకోలేదు. ఇది నిజంగా నమ్మశక్యం కాని పరిస్థితి.

నా క్షేమ సమాచారం కోసం ఆరా తీస్తూ మెసేజ్ లు చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ నాకు కొండంత బలాన్ని ఇస్తోంది. ప్రస్తుతానికి నేను, నా టీమ్ సభ్యులు దుబాయ్ లోనే క్షేమంగా ఉన్నాం. కానీ ఇరాన్ యుద్ధం కారణంగా ఇక్కడ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. మేం ప్రస్తుతం ఇక్కడే చిక్కుకుపోయాం. ఎయిర్ పోర్ట్ అంతా గందరగోళంగా, అల్లకల్లోలంగా ఉంది. ఎంతోమంది ప్రయాణికులు, చిన్న పిల్లలతో ఉన్న కుటుంబాలు ఎక్కడికి వెళ్లాలో తెలియక పడిగాపులు కాస్తున్నారు.

మేం కూడా ఈ క్లిష్ట పరిస్థితి నుంచి ఎప్పుడు బయటపడతామా అని ఆశగా ఎదురుచూస్తున్నాం. మనం గడుపుతున్న సాధారణ జీవితం ఎంత చిన్నదో.. ఎంత అస్థిరమైనదో ఇలాంటి ఘటనలు చూసినప్పుడే మనసుకు తడుతుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇక్కడ చిక్కుకున్న ప్రతి ఒక్కరూ క్షేమంగా బయటపడాలని, త్వరలోనే ఇక్కడ శాంతి నెలకొనాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా" అని తన ట్వీట్ లో పేర్కొంది.

మరోవైపు ఈ విషయంపై భారత బ్యాడ్మింటన్ సంఘం స్పందించింది. సింధుతో పాటు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అధికారులతోనూ టచ్‌లో ఉన్నామని తెలిపింది. "మిగతా క్రీడాకారులు ఇప్పటికే గమ్యస్థానానికి చేరుకోగా, సింధు మాత్రం ఈరోజే బయలుదేరారు. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం" అని బాయ్ వర్గాలు తెలిపాయి.

అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై వైమానిక దాడులు చేయడం, ఇరాన్ కూడా ప్రతీకార చర్యలకు దిగుతుండటంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో దుబాయ్ మీదుగా ఐరోపా, ఆఫ్రికా వెళ్లే విమానాలకు తీవ్ర ఆటంకం కలిగింది. ఇదిలా ఉంటే.. పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి మాత్రం సురక్షితంగా బర్మింగ్‌హామ్ చేరుకున్నారు. మార్చి 3 నుంచి 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది.
PV Sindhu
Sindhu
Dubai Airport
Iran tensions
All England Badminton Championships
Birmingham
flight disruptions
Middle East conflict
Satwiksairaj Rankireddy
Chirag Shetty

More Telugu News