Pawan Kalyan: వేట్లపాలెంలో విస్ఫోటనం తీవ్ర దిగ్భ్రాంతికరం: పవన్ కల్యాణ్

Pawan Kalyan Shocked by Vetlapalem Explosion
  • మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన పవన్ కల్యాణ్
  • బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఉప ముఖ్యమంత్రి
  • పేలుళ్లకు కారణాలపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడి
కాకినాడ జిల్లాలో బాణసంచా పరిశ్రమలో పేలుడు జరిగి 21 మంది మరణించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేట్లపాలెం వద్ద జరిగిన ఈ పేలుడు ఘటనలో పలువురు మృతి చెందారని తెలిసి ఆవేదనకు గురయ్యానని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.

ఈ దుర్ఘటన గురించి తెలియగానే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలంలో ఉండి పరిస్థితిని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ, క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బాణాసంచా తయారీ పరిశ్రమ వద్ద ఇంకా పేలుళ్లు చోటుచేసుకుంటున్నట్టు అధికారులు తెలియజేశారని, పేలుళ్లకు కారణాలపై విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.

బాణాసంచా పరిశ్రమలపై అధికారులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని, భద్రత చర్యలను తనిఖీ చేయాలని జిల్లా అధికారులకు ఆదేశించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. పరిసర గ్రామాలకు పొగ అలుముకున్న క్రమంలో ఆయా గ్రామాల ప్రజలకి ధైర్యం చెప్పి, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సహాయక చర్యల పర్యవేక్షణ కోసం, బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి మంత్రి కందుల దుర్గేశ్, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌లను ఘటనాస్థలానికి పంపించినట్లు తెలిపారు.
Pawan Kalyan
Vetlapalem explosion
Kakinada district
Andhra Pradesh
firecracker factory
accident

More Telugu News