Inter Student: పరీక్ష రాస్తుండగా పురిటి నొప్పులు.. పాల్వంచలో బాత్ రూమ్ లో ప్రసవించిన ఇంటర్ విద్యార్థిని

Inter Student Delivers Stillborn in Palvancha Exam Center Bathroom
  • మృత శిశువును బేసిన్ లో వదిలేసిన బాలిక
  • ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో బాత్ రూమ్ కు వెళ్లి చూసిన ఇన్విజిలేటర్
  • విద్యార్థినిని ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టిన పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఒక ఇంటర్ పరీక్షా కేంద్రంలో శుక్రవారం దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఇంటర్‌ ఫస్టియర్ ఎగ్జామ్ కు హాజరైన 16 బాలిక పరీక్ష కేంద్రంలోని బాత్ రూమ్ లో ప్రసవించింది. బాత్ రూమ్ కు వెళ్లిన విద్యార్థిని ఎంతకూ తిరిగిరాకపోవడంతో ఇన్విజిలేటర్ వెళ్లి చూడగా విషయం బయటపడింది. పోలీసులు వివరాల ప్రకారం.. ఉదయం 9 గంటలకు ఇంటర్ ఫస్టియర్ ఇంగ్లిష్ పరీక్ష ప్రారంభం కాగా 30 నిమిషాల తర్వాత ఓ విద్యార్థిని కడుపు నొప్పిగా ఉందని చెప్పి బాత్ రూమ్ కు వెళ్లింది. ఎంతసేపటికీ ఆమె తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్ అక్కడికి వెళ్లి చూడగా, బాలిక నీరసంగా నడుచుకుంటూ బయటకు వస్తోంది.
బయటపడ్డ అసలు విషయం..

సిబ్బంది ఆరా తీయగా.. తాను గర్భంతో ఉన్నానని, నొప్పులు భరించలేక అక్కడే ప్రసవించానని ఆవేదనతో తెలిపింది. లోపలికి వెళ్లి చూసిన సిబ్బందికి బాత్‌రూమ్ బేసిన్‌లో మృతశిశువు కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని, బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శిశువు మృతదేహాన్ని మార్చురీకి పంపించారు.

విచారణ చేపట్టిన పోలీసులు

ఈ ఘటనపై ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఒకవేళ ఎవరూ ముందుకు రాకపోతే, బాలిక చదువుతున్న కళాశాల యాజమాన్యం ద్వారా ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. చిన్న వయసులోనే ఆ బాలిక గర్భం దాల్చడం వెనుక ఉన్న కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా విద్యాశాఖ అధికారులను మరియు తల్లిదండ్రులను విస్మయానికి గురిచేసింది.

Inter Student
Palvancha
Bhadradri Kothagudem
Inter Exam
Childbirth
Dead Infant
Police Investigation
Education Department
Teenage Pregnancy

More Telugu News