New Zealand Cricket: కివీస్‌పై ఇంగ్లండ్ థ్రిల్లింగ్ విన్.. పాకిస్థాన్ శిబిరంలో సంబరాలు!

New Zealand Loss to England Sparks Celebrations in Pakistan Camp
  • టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ ఉత్కంఠ విజయం
  • కివీస్ ఓటమితో సెమీస్ రేసులో నిలిచిన పాకిస్థాన్
  • 160 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో ఛేదించిన ఇంగ్లీష్ జట్టు
  • చివర్లో మెరిసిన విల్ జాక్స్, రెహాన్ అహ్మద్
  • పాక్, శ్రీలంక మ్యాచ్ ఫలితంపై ఆధారపడ్డ కివీస్ సెమీస్ భవితవ్యం
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా జరిగిన ఓ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. ఈ ఫలితం పాకిస్థాన్ శిబిరంలో ఆనందాన్ని నింపింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే న్యూజిలాండ్ నేరుగా సెమీ ఫైనల్‌కు అర్హత సాధించేది. కానీ ఇంగ్లండ్ చేతిలో ఓడిపోవడంతో కివీస్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. దీంతో వారి భవితవ్యం పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరగబోయే మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది. ఇప్పటికే ఈ గ్రూప్ నుంచి ఇంగ్లండ్ సెమీస్ చేరింది. రెండో బెర్తు కోసం న్యూజిలాండ్, పాక్ రేసులో ఉన్నాయి. రేపటి పోరులో పాక్ భారీ తేడాతో శ్రీలంకపై గెలిస్తే, మెరుగైన రన్ రేట్ ఆధారంగా న్యూజిలాండ్ ను వెనక్కినెట్టి సెమీస్ బెర్తు సొంతం చేసుకుంటుంది. 

ఇవాళ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (39), టిమ్ సీఫెర్ట్ (35) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్, ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, టామ్ బాంటన్ (33), శామ్ కరన్ (24) ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. చివర్లో విల్ జాక్స్ (18 బంతుల్లో 32 నాటౌట్), రెహాన్ అహ్మద్ (7 బంతుల్లో 19 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ బౌలర్ రచిన్ రవీంద్ర 4 ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో గ్రూప్ 2 సెమీస్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది.

New Zealand Cricket
England Cricket
T20 World Cup 2026
Pakistan Cricket
Sri Lanka Cricket
Glenn Phillips
Tim Seifert
Adil Rashid
Will Jacks
Rehan Ahmed

More Telugu News