Somu Veerraju: శాసనమండలిలో సోము వీర్రాజుపైకి దూసుకెళ్లిన వైసీపీ సభ్యులు... సభ రేపటికి వాయిదా

YSRCP members rush towards Somu Veerraju in Legislative Council
  • రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం
  • చర్చ అనంతరం మరో ప్రశ్నపై మాట్లాడేందుకు సిద్ధమైన సోము వీర్రాజు
  • వీర్రాజుపై దాడికి యత్నించిన వైసీపీ సభ్యులు

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఈరోజు రణరంగాన్ని తలపించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య చెలరేగిన వివాదం చివరకు తోపులాట వరకు వెళ్లడంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ముగిసిన తర్వాత, ఈ అంశంపై మరింత చర్చ జరపాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టడంతో గందరగోళం మొదలైంది. అయితే, మంత్రి వివరణ పూర్తయిందని స్పష్టం చేసిన మండలి ఛైర్మన్ మోషేనురాజు... తదుపరి ప్రశ్నకు అవకాశం కల్పించారు. ఈ తరుణంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడేందుకు ప్రయత్నించగా... వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు.


తమ నిరసన కొనసాగుతుండగానే సోము వీర్రాజుకు మైక్ ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ తదితరులు ఒక్కసారిగా వీర్రాజు సీటు వైపు దూసుకెళ్లారు. కేవలం వాగ్వాదానికే పరిమితం కాకుండా, ఆయనపై దాడికి యత్నించడంతో సభలో కలకలం రేగింది. పరిస్థితి విషమిస్తుండటంతో అప్రమత్తమైన మంత్రులు అనిత, గొట్టిపాటి రవికుమార్ వెంటనే సోము వీర్రాజుకు అండగా నిలబడి, వైసీపీ సభ్యులను అడ్డుకున్నారు. ఇరుపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరగడం, సభ్యులు ఒకరిపై ఒకరు దూసుకురావడంతో సభ నియంత్రణ తప్పింది. ఈ క్రమంలో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఛైర్మన్ మోషేనురాజు సభను రేపటికి వాయిదా వేశారు.

Somu Veerraju
Andhra Pradesh
Legislative Council
YSRCP
Rayalaseema Lift Irrigation Scheme
Nimmala Ramanayudu
Moshenu Raju
AP Politics

More Telugu News