India AI Impact Summit 2026: ‘కనెక్టివిటీ’ కరవు.. కాలినడకే దిక్కు.. ఏఐ సదస్సు ప్రతినిధుల కష్టాలు
- టెక్ దిగ్గజాల సదస్సులో ట్రాఫిక్ నరకం..
- వీవీఐపీల కోసం సామాన్యులే కాదు, అతిథులూ బలి
- రోడ్లు క్లోజ్, మెట్రో స్టేషన్ మూసివేత.. 5 కిలోమీటర్లు నడిచిన అతిథులు
హైటెక్ వేదిక, లో టెక్ ఏర్పాట్లు..
బుధవారం సాయంత్రం సదస్సు ముగిసిన తర్వాత ప్రతినిధుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. వీవీఐపీల కదలికల పేరుతో భారత్ మండపం చుట్టుపక్కల రహదారులను మూసివేయడం, సమీపంలోని సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్‌ను నిలిపివేయడంతో వందలాది మంది ప్రతినిధులు రోడ్లపై చిక్కుకుపోయారు. రోడ్ల మూసివేత కారణంగా ఓలా, ఉబర్ వంటి యాప్ ఆధారిత ట్యాక్సీలు లోపలికి రాలేకపోయాయి. షటిల్ సర్వీసులు కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రతినిధులకు నడక తప్పలేదు. అక్షరధామ్ ఆలయం నుంచి ప్రగతి మైదాన్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
సోషల్ మీడియాలో ఆగ్రహం..
సదస్సులో పాల్గొన్న విదేశీ ప్రతినిధులు, టెక్ నిపుణులు తమ చేదు అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘సదస్సు అద్భుతంగా జరిగింది. కానీ ముగింపు మాత్రం దారుణం. రాత్రి 7:40 గంటలకు బయటకు వస్తే ఒక్క వాహనం లేదు. నడుచుకుంటూ వెళ్లమని చెప్పారు. 3 కిలోమీటర్లు నడిచి మరో మెట్రో స్టేషన్‌కు చేరుకున్నాను” అంటూ వంశిక గార్గ్ అనే ప్రతినిధి వాపోయారు. ‘‘మేమంతా 30 శాతం పన్ను చెల్లించే వైట్ కాలర్ ఉద్యోగులం. ఒక క్యాబ్ కోసం 1-2 కిలోమీటర్లు నడవాల్సి రావడం అవమానకరం. ప్రతిభ ఉన్నవారు దేశం విడిచి ఎందుకు వెళుతున్నారో ఇప్పుడర్థమవుతోంది” అంటూ మరో ప్రతినిధి అసహనం వ్యక్తం చేశారు.
ప్రభుత్వాలపై విమర్శల వర్షం..
ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల వైఫల్యంపై రాజకీయ దుమారం రేగింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ.. ‘‘ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు దిక్కుతోచని స్థితిలో రోడ్లపై నడుస్తున్నారు. ట్రాఫిక్ మేనేజ్ చేయడానికి కేంద్రానికి కనీస ‘ఇంటెలిజెన్స్’ కూడా లేదనిపిస్తోంది. ట్రాఫిక్ పోలీసుల తీరు దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉంది’’ అని మండిపడ్డారు.