సోదరుడ్ని తలచుకుని భావోద్వేగాలకు లోనైన జయప్రద

  • తన సోదరుడు రాజాబాబు మొదటి వర్ధంతి సందర్భంగా జయప్రద భావోద్వేగం
  • ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నయ్య ఫోటోతో పాటు ఎమోషనల్ పోస్ట్
  • సోదరుడు తండ్రిలా, తల్లిలా, స్నేహితుడిలా ఉంటాడన్న నటి
  • నువ్వు మమ్మల్ని విడిచి ఏడాది గడిచినా.. ప్రతిరోజూ గుర్తుచేసుకుంటున్నానని ఆవేదన
ప్రముఖ సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద తన దివంగత సోదరుడిని గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన సోదరుడు రాజాబాబు మొదటి వర్ధంతి సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన అన్నయ్య ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ హృదయానికి హత్తుకునేలా ఒక నోట్ రాశారు.

"ఒక సోదరి జీవితంలో తండ్రిలా బాధ్యతగా, తల్లిలా ఆప్యాయంగా, సోదరిలా చిలిపిగా, స్నేహితుడిలా అండగా.. ఇలా అన్ని పాత్రలను ఒక సోదరుడు మాత్రమే పోషించగలడు" అని జయప్రద తన పోస్టులో పేర్కొన్నారు. "ప్రియమైన రాజా, నిన్ను చాలా మిస్ అవుతున్నాం. నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి ఒక సంవత్సరం గడిచింది. కానీ నిన్ను గుర్తు చేసుకోని రోజు లేదు. నీ ప్రేమ, జ్ఞాపకాలు ఎప్పటికీ మా హృదయాల్లో ఉంటాయి. నిన్ను ఎప్పుడూ మిస్ అవుతూనే ఉంటాం" అంటూ తన కుటుంబ సభ్యుల పేర్లతో సహా ఆమె ఇంగ్లీషులో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.

గతేడాది తన అన్నయ్య రాజాబాబు హైదరాబాద్‌లో కన్నుమూసిన విషయాన్ని కూడా జయప్రద సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు తెలియజేశారు.

ఇక జయప్రద కెరీర్ విషయానికొస్తే, తెలుగు, తమిళ చిత్రాలతో నటిగా ప్రస్థానం ప్రారంభించిన ఆమె, 1979లో 'సర్గమ్' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ చిత్రంలోని "డఫ్లీ వాలే" పాట ఆమెకు దేశవ్యాప్తంగా కీర్తిని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఇటీవలే "ఫాతిమా" అనే వెబ్ సిరీస్‌తో ఆమె ఓటీటీలో కూడా అరంగేట్రం చేశారు.


More Telugu News