అవును జాతీయ జంతువుగా ప్రకటించాలి: జమియత్ ఉలేమా చీఫ్

Arshad Madani calls for cow to be declared national animal
  • ఈ పవిత్ర జంతువు చుట్టూ విద్వేషపూరిత ప్రసంగాలు, దాడులు జరుగుతున్నాయని వ్యాఖ్య
  • ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుందని వెల్లడి
  • మతం పేరుతో జరిగే రాజకీయాల వల్ల ఎవరి ప్రాణాలు పోకూడదన్న సయ్యద్
ఆవును 'జాతీయ జంతువు'గా ప్రకటించాలని జమియత్ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అర్షద్ మదానీ బుధవారం అన్నారు. మైనారిటీ వర్గంపై జరుగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలు, దాడుల వెనుక ఈ పవిత్ర జంతువు చుట్టూ అల్లుకున్న విభజన రాజకీయాలే మూలకారణమని ఆయన పేర్కొన్నారు. విద్వేష రాజకీయాలు, పెరుగుతున్న మూకదాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆవును 'జాతీయ జంతువు'గా ప్రకటించడం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందని మదానీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా పోస్టు పెట్టారు.

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. దేశంలోని మెజారిటీ వర్గం ఆవును పవిత్ర జంతువుగా మాత్రమే కాకుండా, తల్లిగా కూడా భావిస్తుందని తెలిపారు. ఆవు పేరుతో జరిగే రాజకీయ ఆట ఇకనైనా అంతం కావాలని ఆకాంక్షించారు. మతం పేరుతో జరిగే రాజకీయాల వల్ల ఎవరి ప్రాణాలు పోకూడదని అన్నారు. దేశంలో మత విభజన, విద్వేష రాజకీయాలకు శాశ్వత పరిష్కారం కావాలని అన్నారు.

గోమాంసం విషయంలో వివిధ రాష్ట్రాలలో వివిధ చట్టాలు ఉన్నాయని గుర్తు చేశారు. మతవిద్వేషంతో కూడిన దాడులు భక్తి అనబడదని, రాజకీయ కుతంత్రాలు అన్నారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే మత విద్వేష సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఇందు కోసం అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన చట్టం ఉండాలని అన్నారు.
Go Back to Shorts
Arshad Madani
Jamiat Ulema-e-Hind
Cow national animal
India cow politics
Cow protection
Religious polarization India

More Telugu News