Nara Lokesh: గత ప్రభుత్వం తెచ్చిన ఆ జీవో పిల్లలను స్కూళ్లకు దూరం చేసింది: నారా లోకేశ్

Nara Lokesh Previous Governments GO Led to Children Staying Away From Schools
  • వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో 117తో ప్రభుత్వ స్కూళ్లకు దూరమయ్యారన్న మంత్రి
  • వన్ క్లాస్ - వన్ టీచర్ పాఠశాలలను 33 శాతానికి పెంచామన్న నారా లోకేశ్
  • రూ.1000 కోట్లతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని వెల్లడి
  • శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేశ్
గత ప్రభుత్వం 2019-24 సమయంలో జీవో 117 తీసుకురావడంతో పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని, ఈ క్రమంలో ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రజాప్రభుత్వం వచ్చాక ఆ జీవోను రద్దు చేశామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానమిస్తూ, గత ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం చేపట్టిన తర్వాత కూడా 233 పాఠశాలలు మూసివేసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

అంతేకాకుండా పాఠశాల విద్యాభివృద్ధిలో వన్ క్లాస్ - వన్ టీచర్ విధానం చాలా కీలకమైందని, గతంలో 3 శాతం పాఠశాలల్లో మాత్రమే వన్ క్లాస్ - వన్ టీచర్ ఉంటే, ఇప్పుడు 33 శాతానికి పెంచామని అన్నారు. దీనిద్వారా పిల్లలకు మెరుగైన విద్య అందడంతో పరీక్షల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని అన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రధానంగా 5 అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని అన్నారు.

ప్రధానంగా లీక్ ప్రూఫ్ బిల్డింగ్, పెయింట్స్, బెంచీలు, టాయ్ లెట్స్, తాగునీరు అందించాలని నిర్ణయించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ ఇచ్చామని, ఏపీలో 5 స్టార్ రేటింగ్ ఉన్నవి లేవని వెల్లడించారు. 40 శాతం 1, 2లో స్టార్‌లో ఉన్నాయని, అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 3, 4 స్టార్ రేటింగ్ కు తేవాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. పెండింగ్ వర్క్స్ పూర్తిచేయాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ఎక్కడ తరగతి గదుల అవసరం ఉందో అక్కడ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని నిర్ణయించామని అన్నారు.

ఎస్ఎంసీ ఎకౌంట్ లో రూ.200 కోట్ల నిధులు ఉన్నాయని, బడ్జెట్ లో రూ.800 కోట్లు అదనంగా కేటాయించారని అన్నారు. ఈ రెండు కలిపి వచ్చే ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక మౌలిక సదుపాయాలకు రూ.వెయ్యి కోట్లు ఖర్చుచేసే అవకాశం ఉందని అన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక పద్ధతి ప్రకారం 5 స్టార్ రేటింగ్ తెచ్చే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. 2014-19 నడుమ చేసిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపునకు చర్యలు చేపడతామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. 

అంతకుముందు ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, గత ప్రభుత్వం పాఠశాలల విషయంలో అస్తవ్యస్థ విధానాలు అవలంభించిందని అన్నారు. నాడు- నేడు పేరుతో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. వాటి కారణంగా నేటికి కూడా అనేక చోట్ల అసంపూర్తి నిర్మాణాలు, మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలలో నూతన విద్యావిధానానికి శ్రీకారం చుట్టి, పెద్దఎత్తున ఉపాధ్యాయ పోస్టుల నియామకం చేపట్టినట్లు తెలిపారు.

మనబడి - మన భవిష్యత్ పేరిట పాఠశాలలను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతూ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నారని అన్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోందని అన్నారు. అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలు, తరగతి గదులను సత్వరం పూర్తిచేయాల్సిందిగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారని అన్నారు.

2019 ఎన్నికలకు ముందు తిత్లీ తుపానులో ఎన్నో పాఠశాలలు దెబ్బతిన్నాయని గుర్తు చేశారు. నాటి చంద్రబాబు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేసినప్పటికీ, టీడీపీ సానుభూతిపరులు పనులు చేశారనే కారణంతో వైసీపీ ప్రభుత్వం వాటి బిల్లులు చెల్లించలేదని అన్నారు. గత ఐదేళ్లలో నాడు-నేడు అక్రమాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అసంపూర్తిగా నిలచిపోయిన భవనాలు పూర్తి చేయాలని గౌతు శిరీష విజ్ఞప్తి చేశారు.
Nara Lokesh
AP schools
Andhra Pradesh education
Gouthu Sirisha
Naadu Nedu scheme
AP government schools

More Telugu News