బెంగళూరులో ఆఫీస్ తెరిచిన ఏఐ దిగ్గజం ఆంత్రోపిక్... ఉద్యోగాలకు ప్రకటన

  • బెంగళూరులో కార్యాలయం ప్రారంభించిన అమెరికా ఏఐ సంస్థ ఆంత్రోపిక్
  • ఆసియాలో టోక్యో తర్వాత ఇది ఆ సంస్థకు రెండో ఆఫీస్
  • భారత్ తమకు రెండో అతిపెద్ద మార్కెట్ అని వెల్లడి
  • విద్య, న్యాయ రంగాల్లో పలు స్థానిక సంస్థలతో భాగస్వామ్యాలు
  • స్థానికంగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటన
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ ఆంత్రోపిక్, భారత్‌లో అధికారికంగా తన కార్యకలాపాలు ప్రారంభించింది. సోమవారం బెంగళూరులో కొత్త కార్యాలయాన్ని తెరిచినట్లు ప్రకటించింది. ఆసియాలో టోక్యో తర్వాత ఆంత్రోపిక్ ఏర్పాటు చేసిన రెండో కార్యాలయం ఇది. స్థానికంగా వివిధ విభాగాల్లో ఉద్యోగులను నియమించుకోవడంపై దృష్టి సారించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

తమ ఏఐ టూల్ ‘క్లాడ్’కు (Claude.ai) భారత్ రెండో అతిపెద్ద మార్కెట్ అని ఆంత్రోపిక్ పేర్కొంది. దేశంలో క్లాడ్ వినియోగంలో దాదాపు సగం వాటా కంప్యూటర్, గణిత సంబంధిత పనులకే ఉందని వివరించింది. "భారత్‌లో అపారమైన సాంకేతిక నైపుణ్యం, డిజిటల్ మౌలిక వసతులు ఉన్నాయి. బాధ్యతాయుతమైన ఏఐ ప్రయోజనాలను ఎక్కువ మందికి అందించేందుకు ఇది గొప్ప అవకాశం" అని ఆంత్రోపిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఇరినా ఘోష్ అన్నారు.

ఈ సందర్భంగా భారత్‌లో విద్య, వ్యవసాయం, న్యాయ సేవలు వంటి పలు రంగాల్లో తమ భాగస్వామ్యాలను కూడా ఆంత్రోపిక్ ప్రకటించింది. విద్యా రంగంలో ‘ప్రథమ్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. ప్రథమ్ రూపొందించిన ‘ఎనీటైమ్ టెస్టింగ్ మెషీన్’కు క్లాడ్ ఏఐ సాంకేతికతను అందిస్తున్నామని, ప్రస్తుతం 20 స్కూళ్లలో 1,500 మంది విద్యార్థులతో పైలట్ ప్రాజెక్ట్ నడుస్తోందని, 2026 చివరి నాటికి దీన్ని 100 పాఠశాలలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది.

అలాగే, న్యాయ సేవల యాక్సెస్‌ను మెరుగుపరిచేందుకు ‘అదాలత్ ఏఐ’కు సహకారం అందిస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా వాట్సాప్ హెల్ప్‌లైన్ ద్వారా కోర్టు కేసుల అప్‌డేట్స్, పత్రాల అనువాదం, సారాంశం వంటి సేవలను ప్రాంతీయ భాషల్లో పొందవచ్చని పేర్కొంది. అక్టోబర్ 2025 నుంచి భారత్‌లో తమ రెవెన్యూ రెట్టింపు అయిందని కంపెనీ వెల్లడించింది.


More Telugu News