Alin Sherin Abraham: ఐదు ప్రాణాలను నిలిపిన పసికందు... కేరళలో అతి పిన్న వయస్కురాలి అవయవదానం

తీవ్ర విషాదంలోనూ ఓ కుటుంబం తీసుకున్న గొప్ప నిర్ణయం ఐదుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. కేవలం పది నెలల వయసున్న ఓ చిన్నారి, కేరళ రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన అవయవదాతగా నిలిచింది. పత్తనంతిట్ట జిల్లాకు చెందిన అలిన్ షెరిన్ అబ్రహం అనే ఈ చిన్నారి అవయవాలను ఐదుగురికి అమర్చనున్నారు.

ఫిబ్రవరి 5న కొట్టాయం నుంచి తిరువళ్ల వెళ్తుండగా ఎం.సి. రోడ్డులో అలిన్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెతో పాటు కారులో ఉన్న తల్లి, తాతయ్య, నాయనమ్మ కూడా గాయపడ్డారు. వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించి, మెరుగైన చికిత్స కోసం ఫిబ్రవరి 7న కొచ్చిలోని అమృత ఆసుపత్రికి మార్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఫిబ్రవరి 13న చిన్నారి బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు వైద్యులు ప్రకటించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ, చిన్నారి తల్లిదండ్రులు అరుణ్ అబ్రహం, షెరిన్ ఆన్ జాన్ తమ కుమార్తె అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు.

వైద్యులు చిన్నారి నుంచి కాలేయం, రెండు కిడ్నీలు, గుండె కవాటం, రెండు కనుగుడ్లను సేకరించారు. కాలేయాన్ని తిరువనంతపురంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరు నెలల బాబుకు అమర్చనున్నారు. రెండు కిడ్నీలను తిరువనంతపురం మెడికల్ కాలేజీలోని శాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో చిన్నారికి, గుండె కవాటాన్ని శ్రీ చిత్ర ఇనిస్టిట్యూట్‌కు పంపారు. కనుగుడ్లను అమృత ఆసుపత్రిలోనే ఉంచారు.

అవయవాలను కొచ్చి నుంచి తిరువనంతపురానికి తరలించడం కోసం పోలీసులు, ప్రజల సహకారంతో గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. సాధారణంగా ఆరు గంటలు పట్టే ప్రయాణాన్ని కేవలం 3 గంటల 15 నిమిషాల్లోనే పూర్తి చేశారు. ఈ మొత్తం ప్రక్రియను కేరళ స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (కే-సొట్టో) పర్యవేక్షించింది. తీవ్ర దుఃఖంలోనూ గొప్ప నిర్ణయం తీసుకున్న చిన్నారి తల్లిదండ్రులకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మిషన్‌ను విజయవంతం చేసిన వైద్య సిబ్బంది, పోలీసులు, ప్రజలను ఆమె అభినందించారు.
Alin Sherin Abraham
Kerala organ donation
infant organ donor
organ transplant
KIMS Hospital
Amrita Hospital
Veena George
K-SOTTO
green channel
pediatric organ transplant

More Telugu News