Riyan Parag: శాంసన్ చెన్నైకి... రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్

Riyan Parag Appointed as Rajasthan Royals New Captain
  • సంజూ శాంసన్‌ను చెన్నైకి ట్రేడ్ చేయడంతో ఈ మార్పు
  • గత సీజన్‌లోనూ కొన్ని మ్యాచ్‌లకు తాత్కాలిక కెప్టెన్‌గా పరాగ్
  • ఇప్పుడు పూర్తి స్థాయిలో సారథ్య బాధ్యతలు
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. యువ ఆటగాడు రియాన్ పరాగ్‌ను తమ కొత్త కెప్టెన్‌గా నియమిస్తూ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. గత నాలుగు సీజన్లుగా జట్టుకు నాయకత్వం వహించిన సంజూ శాంసన్‌ను వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు ట్రేడ్ చేయడంతో, పరాగ్‌కు ఈ బాధ్యతలు దక్కాయి. ఈ నిర్ణయంతో రాజస్థాన్ జట్టులో ఒక కొత్త శకం మొదలైంది.

పరాగ్‌కు కెప్టెన్సీ కొత్తేమీ కాదు. ఐపీఎల్ 2025 సీజన్‌లో సంజూ శాంసన్ గాయం కారణంగా కేవలం బ్యాటింగ్‌కే పరిమితమైనప్పుడు, తొలి మూడు మ్యాచ్‌లకు పరాగ్ స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్‌లో మొత్తం 8 మ్యాచ్‌లకు సారథ్యం వహించి, 2 విజయాలు, 6 ఓటములు నమోదు చేశాడు. ఆ సమయంలో రాజస్థాన్ రాయల్స్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా (23) పరాగ్ రికార్డు సృష్టించాడు.

రాజస్థాన్ కెప్టెన్సీకి ఘనమైన చరిత్ర ఉంది. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్‌లో దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ సారథ్యంలో యువ జట్టుతో బరిలోకి దిగి అనూహ్యంగా టైటిల్ గెలుచుకుంది. వార్న్ తర్వాత రాహుల్ ద్రావిడ్, షేన్ వాట్సన్, అజింక్యా రహానే, స్టీవ్ స్మిత్ వంటి దిగ్గజాలు జట్టును నడిపించారు. వారిలో 57.50 శాతం విజయాలతో ద్రావిడ్ ఫ్రాంచైజీకి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు.

2021లో కెప్టెన్ అయిన సంజూ శాంసన్, జట్టును అత్యధికంగా 67 మ్యాచ్‌లలో నడిపించి, 33 విజయాలు సాధించిన కెప్టెన్‌గా రికార్డుల్లో నిలిచాడు. అతని నాయకత్వంలోనే 2022లో రాజస్థాన్ ఫైనల్‌కు చేరింది. ఇప్పుడు శాంసన్ స్థానంలో పరాగ్ రాకతో, తొలి టైటిల్ గెలిచిన 18 ఏళ్ల తర్వాత మరోసారి కప్ గెలవాలని జట్టు ఆశిస్తోంది. పరాగ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి.
Riyan Parag
Rajasthan Royals
Sanju Samson
IPL 2026
Chennai Super Kings
Shane Warne
Rahul Dravid
IPL Captaincy
Indian Premier League

More Telugu News