KTR: కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి 'నేనే రాజు' వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్

KTR Counters Revanth Reddys Comments on KCRs Defeat
  • నేనే రాజు నేనే మంత్రి అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన
  • అలా అనుకున్న వారు ఎందరో గాలికి కొట్టుకుపోయారన్న కేటీఆర్
  • తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను కూడా కామారెడ్డిలో ప్రజలు ఓడించారన్న కేటీఆర్
తెలంగాణకు 'నేనే రాజు నేనే మంత్రి' అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 'నేనే రాజు నేనే మంత్రి' అనుకునే పిచ్చి తుగ్లక్‌లు చాలామంది ఉంటారని, చరిత్రలో కూడా ఒక తుగ్లక్ ఉండేవాడని ఎద్దేవా చేశారు. అలా అనుకున్నవారు ఎందరో గాలికి కొట్టుకుపోయారని అన్నారు.

ప్రజల చైతన్యాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయవద్దని అన్నారు. ఈ దేశంలో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ వంటి నాయకులు సైతం ఓడిపోయారని గుర్తు చేశారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ వంటి నాయకుడిని కూడా కామారెడ్డిలో దురదృష్టవశాత్తూ ప్రజలు ఓడించారని అన్నారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడో స్థానానికి వచ్చారని గుర్తు చేశారు. ఇలా నేనే రాజు నేనే మంత్రి అని రేవంత్ రెడ్డిలా విర్రవీగిన వాళ్లు వచ్చారు, పోయారని... కానీ దేశం, ప్రజల చైతన్యం అలాగే ఉందన్నారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో తాము పూర్తి స్పష్టతతో ఉన్నామని కేటీఆర్ అన్నారు. తన ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంత విశ్వాసం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. పదిచోట్ల ఉప ఎన్నికలు వస్తే అప్పుడు ప్రజలు తేల్చుతారని అన్నారు.
KTR
Revanth Reddy
Telangana
BRS
Congress
Municipal Elections
KCR
Indira Gandhi
NTR

More Telugu News