Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు అంటూ వీడియో వైరల్... స్పందించిన బన్నీ టీమ్

Allu Arjun Team Responds to Viral Video of 42 Rules
  • ఆరోపణలను తీవ్రంగా ఖండించిన బన్నీ టీమ్
  • తప్పుడు ప్రచారంపై పరువు నష్టం దావాకు సన్నాహాలు
  • నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలు షేర్ చేయవద్దని సూచన
  • పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా వ్యాపించిన దుష్ప్రచారం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ దుష్ప్రచారాన్ని ఆయన బృందం తీవ్రంగా ఖండించింది. అల్లు అర్జున్‌ను కలవాలంటే కఠినమైన ప్రోటోకాల్ పాటించాలంటూ వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా అవాస్తవమని, దీనికి బాధ్యులైన వారిపై పరువు నష్టం దావా వేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు అల్లు అర్జున్ మేనేజర్, మీడియా స్ట్రాటజిస్ట్ శరత్ చంద్ర నాయుడు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.

ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మాజీ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బారువా మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు ఉంటాయని ఆరోపించారు. ఆయన కళ్లలోకి నేరుగా చూడకూడదని, కరచాలనం చేసే అవకాశం ఉండదని, ఆయన్ను కలవాలంటే పలువురు మేనేజర్లను దాటాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందించారు. 'అల్లు అర్జున్ ఏమైనా మానవాతీత శక్తా?... ఆ నిబంధన అల్లు అర్జున్ పెట్టి ఉండడు... బహుశా ఆయన భార్య పెట్టిన నిబంధన అయి ఉంటుంది" అంటూ పలు రకాల ట్రోల్స్, నెగటివ్ కామెంట్లతో ఇది చర్చనీయాంశంగా మారింది.

ఈ ప్రచారం శ్రుతిమించడంతో అల్లు అర్జున్ బృందం వెంటనే రంగంలోకి దిగింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, వాటిలో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పింది. అల్లు అర్జున్ మేనేజర్ శరత్ చంద్ర నాయుడు తన ప్రకటనలో, ‘‘తాజాగా అల్లు అర్జున్‌పై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఈ వ్యవహారాన్ని మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. దీనికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. దయచేసి ధృవీకరించని కంటెంట్‌ను షేర్ చేయవద్దు’’ అని పేర్కొన్నారు. అల్లు అర్జున్ ఎల్లప్పుడూ అందరితో హుందాగా, గౌరవంగానే మెలుగుతారని స్పష్టం చేశారు.
Allu Arjun
Allu Arjun protocol
Kaveri Barua
Royal Enfield
Sarath Chandra Naidu
Allu Arjun rules
Allu Arjun controversy
Icon Star
Telugu cinema
celebrity interview

More Telugu News