Zohran Mamdani: వెనిజులా అధ్యక్షుడి అరెస్ట్‌పై దుమారం.. ట్రంప్ నిర్ణయంపై న్యూయార్క్ మేయర్ ఫైర్.. అధ్యక్షుడికే నేరుగా ఫోన్

Nicolas Maduro Arrest Trumps Decision Criticized by New York Mayor
  • ఇది యుద్ధ చర్యేనంటూ వ్యతిరేకించిన న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ
  • అరెస్ట్‌పై నిరసన తెలుపుతూ అధ్యక్షుడు ట్రంప్‌కు నేరుగా ఫోన్ చేసిన మేయర్
  • నార్కో-టెర్రరిజం కేసులో మదురోపై న్యూయార్క్‌లో అభియోగాలు నమోదు
  • కాంగ్రెస్ అనుమతి లేకుండా సైనిక చర్య రాజ్యాంగ విరుద్ధమన్న ఎంపీ రాజా కృష్ణమూర్తి
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అమెరికా సైన్యం అరెస్ట్ చేయ‌డం తీవ్ర దుమారం రేపుతోంది. ఒక సార్వభౌమ దేశంపై ఏకపక్షంగా దాడి చేయడం 'యుద్ధ చర్య' కిందకే వస్తుందని న్యూయార్క్ నగర నూతన మేయర్ జోహ్రాన్ మమ్దానీ తీవ్రంగా స్పందించారు. ఈ చర్యపై తన వ్యతిరేకతను తెలియజేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నేరుగా ఫోన్ చేసి మాట్లాడానని ఆయన వెల్లడించారు.

నార్కో-టెర్రరిజం, మాదకద్రవ్యాల సరఫరా, ఆయుధాల వినియోగం వంటి తీవ్రమైన ఆరోపణలపై నికోలస్ మదురో దంపతులపై న్యూయార్క్‌లో అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ నిమిత్తం వారిని అమెరికా సైన్యం ప్రత్యేక ఆపరేషన్ ద్వారా బంధించి న్యూయార్క్‌కు తరలిస్తోంది. మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన రెండు రోజులకే ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

ఈ సందర్భంగా మేయర్ మమ్దానీ మాట్లాడుతూ... "ఈ చర్య కేవలం విదేశాలకే పరిమితం కాదు. న్యూయార్క్‌లో నివసిస్తున్న వేలాది మంది వెనిజులా పౌరులతో సహా అందరిపైనా ప్రభావం చూపుతుంది. వారి భద్రతే నాకు ముఖ్యం" అని పేర్కొన్నారు. 

మరోవైపు అమెరికా అటార్నీ జనరల్ పమేలా బాండీ స్పందిస్తూ.. మదురో దంపతులను త్వరలోనే అమెరికా న్యాయవ్యవస్థ ముందుకు తీసుకువస్తారని, ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్న అధ్యక్షుడు ట్రంప్‌కు, సైన్యానికి ధన్యవాదాలని తెలిపారు.

ఈ సైనిక చర్యను తప్పుబట్టిన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి 
అయితే, ఈ సైనిక చర్యను కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తప్పుబట్టారు. కాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు ఏకపక్షంగా సైనిక శక్తిని ప్రయోగించడం అధికార దుర్వినియోగం, రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని అన్నారు. ఇలాంటి చర్యలు అమెరికా విశ్వసనీయతను దెబ్బతీసి, దేశ భద్రతకే ముప్పు కలిగిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Zohran Mamdani
Nicolas Maduro
Venezuela
Donald Trump
New York Mayor
US Military
arrest
narco-terrorism
Raja Krishnamoorthi
Pamela Bondi

More Telugu News