Srikanth Reddy: ప్రేమించిన అమ్మాయి కోసం లండన్ నుంచి వచ్చిన టెక్కీ.. మరొకరిని పెళ్లి చేసుకుంటోందని ఆత్మహత్య

Srikanth Reddy Techie Commits Suicide After Learning Lovers Marriage
  • లండన్‌లో ఉంటున్న నిజామాబాద్ జిల్లా దొంచంద గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి
  • ఏరుగట్ల గ్రామానికి చెందిన అఖిలతో ఆరేళ్లుగా ప్రేమాయణం
  • వివాహం చేసుకుందామని లండన్ నుంచి వచ్చిన శ్రీకాంత్
  • ప్రియురాలికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని ఆవేదనతో ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి వేరొకరిని వివాహం చేసుకుంటోందన్న మనస్తాపంతో లండన్ నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని దొంచంద గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి లండన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఏరుగట్ల గ్రామానికి చెందిన అఖిల, శ్రీకాంత్ రెడ్డి గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు.

శ్రీకాంత్ రెడ్డి, అఖిల వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై ఇరు కుటుంబాలతో మాట్లాడి, వివాహం చేసుకోవడానికి శ్రీకాంత్ రెడ్డి లండన్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. అయితే, అఖిలకు వేరొక వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని తెలుసుకుని శ్రీకాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. మనోవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ శ్రీకాంత్ రెడ్డి మరణించాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు న్యాయం కోసం డిమాండ్ చేస్తూ ఏరుగట్ల గ్రామంలో మృతదేహాన్ని పోలీసు వాహనంపై ఉంచి నిరసన తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Srikanth Reddy
Nizamabad
Software Engineer Suicide
Love Affair
Telangana News

More Telugu News