ఉద్యోగాలకే మా ప్రాధాన్యం.. రేడియేషన్ భయాలు లేవు: నారా లోకేశ్

  • గూగుల్ ప్రాజెక్ట్‌పై లోకేశ్ కీలక వ్యాఖ్యలు
  • ఏపీని ప్రపంచ స్థాయి ఏఐ హబ్‌గా మారుస్తామని వ్యాఖ్య
  • గూగుల్ డేటా సెంటర్ విలువ ప్రజలకు తెలుసన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లోని తర్లువాడలో ఏర్పాటు చేయనున్న గూగుల్ డేటా హబ్ వల్ల రాష్ట్రంలో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ ప్రాజెక్టుకు స్థానిక ప్రజల నుంచి వస్తున్న మద్దతును ప్రస్తావిస్తూ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.

తర్లువాడలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్‌పై ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనాన్ని లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. రేడియేషన్ వంటి ఆందోళనలు ఉన్నప్పటికీ, స్థానిక ప్రజలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆ కథనం పేర్కొంది. ఈ విషయాన్ని ఉటంకిస్తూ, గూగుల్ డేటా ప్రాజెక్టు విలువ ప్రజలకు తెలుసని లోకేశ్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్‌లను నిర్మించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ హబ్‌ల ద్వారా నూతన ఆవిష్కరణలు ఊపందుకుంటాయని, సాంకేతికంగా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యం కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాదని, తద్వారా యువతకు ఉపాధి కల్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమని ఆయన పేర్కొన్నారు.


More Telugu News