Chandrababu Naidu: రేపు ఢిల్లీలో 110 దేశాల ప్రతినిధులతో సదస్సు... ఏపీ బ్రాండ్ ఇమేజ్‌పై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్

Chandrababu Naidu to Showcase AP Governance at Raisina Dialogue 2026 Delhi
  • రేపు ఢిల్లీలో రైసినా డైలాగ్ 2026 సదస్సు
  • హాజరుకానున్న సీఎం చంద్రబాబు 
  • సాంకేతికత వినియోగం మరియు సుపరిపాలనపై కీలక ఉపన్యాసం చేయనున్న ముఖ్యమంత్రి
  • సదస్సుకు హాజరుకానున్న 110 దేశాలకు చెందిన 2,700 మంది అంతర్జాతీయ ప్రతినిధులు
  • రియల్ టైమ్ గవర్నెన్స్ సహా ఏపీ మోడల్‌ను ప్రపంచానికి వివరించనున్న చంద్రబాబు
ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ కీర్తిని మరోసారి చాటేందుకు, రాష్ట్రంలో అమలు చేస్తున్న వినూత్న పాలనా విధానాలను అంతర్జాతీయ సమాజానికి వివరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరగనున్న అత్యంత ప్రతిష్టాత్మక ‘రైసినా డైలాగ్ 2026’ సదస్సుకు ఆయన శనివారం హాజరుకానున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సులో సీఎం పాల్గొని, 'సాంకేతికత - సుపరిపాలన', భవిష్యత్ సవాళ్లు అనే అంశాలపై కీలక ఉపన్యాసం చేయనున్నారు.

ప్రపంచం దృష్టిని ఆకర్షించే వేదిక
ప్రపంచ రాజకీయాలు, అంతర్జాతీయంగా మారుతున్న ఆర్థిక వ్యవస్థపై చర్చించేందుకు అత్యున్నత వేదికగా 'రైసినా డైలాగ్‌'కు గొప్ప పేరుంది. 2016 నుంచి ఏటా నిర్వహిస్తున్న ఈ సదస్సు.. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన 'మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్' తరహాలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈసారి జరుగుతున్న 11వ ఎడిషన్ సదస్సులో దాదాపు 110 దేశాలకు చెందిన 2,700 మంది ప్రతినిధులు పాల్గొంటుండటం విశేషం. వివిధ దేశాల అధినేతలు, మంత్రులు, అత్యున్నత సైనిక అధికారులు, విధానకర్తలు, మేధావులు ఒకే వేదికపై గ్లోబల్ వ్యూహాలను చర్చించనున్నారు. ఈ ఏడాది ఈ సదస్సును సంస్కార, అన్వేషణ, సమన్వయం, పురోగతి అనే ఆసక్తికరమైన థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ఈ సదస్సులో ప్రధాన ఉపన్యాసం చేయనున్నారు.

సీఎం పర్యటన వివరాలు
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు రేపు (మార్చి 7) ఉదయం 10.50 గంటలకు విజయవాడ నుంచి విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ వేదికగా జరిగే 'రైసినా డైలాగ్ 2026' సెషన్‌లో పాల్గొంటారు. సదస్సు ముగిసిన అనంతరం ఆయన తిరిగి అమరావతికి పయనమవుతారు.

ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ప్రసంగం
దేశంలోనే అభివృద్ధి పథాన నడుస్తున్న రాష్ట్రంగా ఏపీలో అమలు చేస్తున్న సుపరిపాలన, డిజిటల్ విప్లవం గురించి ముఖ్యమంత్రి తన ప్రసంగంలో సవివరంగా చెప్పనున్నారు. ప్రధానంగా రియల్ టైమ్ గవర్నెన్స్, డేటా ఆధారిత నిర్ణయాల ద్వారా సామాన్య ప్రజలకు పౌరసేవలను ఎంత వేగంగా, పారదర్శకంగా అందిస్తున్నారో వివరించనున్నారు. పాలనకు సాంకేతికతను జోడించి ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, సంపద సృష్టి, 'స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్' వంటి అంశాలపై తన సుదీర్ఘ అనుభవాలను అంతర్జాతీయ ప్రతినిధులతో పంచుకోనున్నారు.

అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ ఆవిష్కరణల కేంద్రంగా, అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న దార్శనిక నిర్ణయాలను ప్రపంచ దేశాల ముందు ఉంచనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎకోసిస్టమ్, భారీ డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ కారిడార్ల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించనున్నారు. పెట్టుబడులకు స్వర్గధామంగా ఏపీని మార్చేందుకు చేస్తున్న కృషిని, భవిష్యత్ ప్రణాళికలను ఈ వేదిక ద్వారా ప్రపంచానికి తెలియజేయనున్నారు.


Chandrababu Naidu
Andhra Pradesh
Raisina Dialogue 2026
Digital Governance
Real Time Governance
AP Brand Image
Technology
Investments
Economic Growth
Amaravati

More Telugu News