PIB Fact Check: కూలిన హెలికాప్టర్‌తో పాక్ దుష్ప్రచారం.. పాత వీడియో అంటూ క్లారిటీ ఇచ్చిన భారత్

PIB Fact Check Debunks Pakistans Helicopter Crash Propaganda
  • ఐఎం-17 హెలికాప్టర్‌ను తమ క్షిపణి కూల్చివేసిందని పాక్ అనుకూల సామాజిక ఖాతాల దుష్ప్రచారం
  • అది పాత వీడియో అంటూ స్పష్టతనిచ్చిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం
  • నకిలీ సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత్ విజ్ఞప్తి
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతీయ ఎంఐ-17 హెలికాప్టర్‌ను తమ క్షిపణి ద్వారా కూల్చివేశామని పాకిస్థాన్ అనుకూల సామాజిక మాధ్యమల ఖాతాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారాన్ని భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. అయినప్పటికీ పాకిస్థాన్ తన దుష్ప్రచారాన్ని ఆపడం లేదు.

కొన్ని పాకిస్థాన్ అనుకూల ఖాతాలు పాత వీడియోలను తిరిగి ప్రసారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఐఎం-17 హెలికాప్టర్‌ను క్షిపణి ద్వారా కూల్చివేశామని చేస్తున్న ప్రచారంపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందిస్తూ ఇది 2019లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో అని స్పష్టం చేసింది.

భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ జమ్మూకశ్మీర్‌లోని బూద్గామ్ సమీపంలో అప్పట్లో కూలిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ భారత ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పాక్ అనుకూల ఖాతాల ద్వారా ఇలాంటి నకిలీ సమాచారాన్ని తరుచూ ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఇలాంటి అసత్య ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
PIB Fact Check
Pakistan propaganda
Operation Sindoor
Indian helicopter crash
IAF Mi-17V5
Jammu Kashmir

More Telugu News