ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ బోణీ.. హాంగ్ కాంగ్‌పై ఘన విజయం

  • ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌కు ఘనమైన ఆరంభం
  • హాంగ్ కాంగ్‌పై 94 పరుగుల తేడాతో ఘ‌న విజ‌యం
  • అర్ధ శతకాలతో మెరిసిన అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్
  • కేవలం 20 బంతుల్లోనే ఒమర్జాయ్ మెరుపు హాఫ్ సెంచరీ
  • ఆఫ్ఘన్ బౌలర్ల ధాటికి కుప్పకూలిన హాంగ్ కాంగ్.. 94 ర‌న్స్‌కే ప‌రిమితం
ఆసియా కప్ 2025 టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్ జట్టు శుభారంభం చేసింది. మంగళవారం అబుదాబిలోని జాయెద్ క్రికెట్ స్టేడియంలో జరిగిన గ్రూప్-బీ మ్యాచ్‌లో హాంగ్ కాంగ్‌పై 94 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో సెడిఖుల్లా అటల్ (73 నాటౌట్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్ (53) అర్ధ శతకాలతో చెలరేగగా, అనంతరం బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మహమ్మద్ నబీ (33), ఓపెనర్ అటల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. నబీ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఒమర్జాయ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 20 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో తన తొలి టీ20 అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు అటల్ చివరి వరకు నిలకడగా ఆడి 52 బంతుల్లో 73 పరుగులు చేశాడు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోరు సాధించింది. హాంగ్ కాంగ్ బౌలర్లలో షా రెండు వికెట్లు తీశాడు.

అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంగ్ కాంగ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఫజల్‌హక్ ఫరూఖీ వేసిన ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ అన్షుమన్ డకౌట్ అయ్యాడు. పవర్ ప్లే ముగిసేసరికి 23 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బాబర్ హయత్ (39) ఒక్కడే కాసేపు పోరాడినా, మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో హాంగ్ కాంగ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 94 పరుగులకే పరిమితమైంది. ఆఫ్ఘన్ బౌలర్లలో గుల్బాదిన్ నైబ్, ఫజల్‌హక్ ఫరూఖీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో రెండు జట్ల ఫీల్డింగ్ చాలా పేలవంగా సాగింది. ఇరు జట్లు కలిసి మొత్తం 8 క్యాచ్‌లను నేలపాలు చేయడం గమనార్హం. అయినప్పటికీ బ్యాటింగ్, బౌలింగ్‌లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన ఆఫ్ఘనిస్థాన్ టోర్నీలో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది.


More Telugu News