చంద్రబాబు హామీలపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైఎస్ జగన్
Add ap7am to your home Screen

చంద్రబాబు హామీలపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైఎస్ జగన్

YS Jagan Slams Chandrababu on Super Six Promises
  • చంద్రబాబు మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారన్న జగన్
  • మహిళల ఉచిత బస్సు పథకాన్ని చెప్పిన విధంగా అమలు చేయడం లేదని విమర్శ 
  • మొత్తం 11,256 బస్సులు ఉంటే అందులో కేవలం 6,700 బస్సులకే పరిమితం చేశారన్న జగన్  
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మోసాలతో అక్కచెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్న హామీని కూడా చెప్పిన విధంగా అమలు చేయడం లేదని విమర్శించారు.

ఎన్నికలకు ముందు సూపర్-6, సూపర్-7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించిన వీడియో ప్రకటనలతో మహిళలందరినీ నమ్మించారని దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే జూన్ నుంచే హామీలు అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచి, 14 నెలల పాటు ఆ ఊసే ఎత్తలేదని, తీరా ఇప్పుడు అతి చిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణం కూడా అన్ని బస్సుల్లో కాదని, కొన్ని బస్సుల్లోనే ఉచితం అంటున్నారని విమర్శించారు. ఆ కొన్ని బస్సుల్లో కూడా సవాలక్ష ఆంక్షలు పెట్టారని, రాష్ట్రం అంతా కాకుండా కొన్ని చోట్లకే పరిమితం చేశారని విమర్శించారు.

ఆర్టీసీలో 16 కేటగిరీల బస్సులు ఉంటే అందులో కేవలం 5 రకాల బస్సుల్లోనూ, మొత్తం 11,256 బస్సులు ఉంటే అందులో కేవలం 6,700 బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేశారన్నారు. ఈ బస్సుల్లో కూడా ఆంక్షలు విధించారని, 1,560 ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉంటే, అందులో 950 నాన్ స్టాప్ బస్సులకు ఈ పథకం వర్తించదంటూ ఏకంగా బోర్డులు పెడుతున్నారని ఆరోపించారు. ఇది అక్కచెల్లెమ్మలకు చేసిన మోసం కాదా? దగా కాదా? అని జగన్ నిలదీశారు.

చంద్రబాబు ఇంత మోసం చేసి కూడా చేస్తున్న ప్రచారాలు చూస్తుంటే విడ్డూరంగా ఉన్నాయని జగన్ అన్నారు. బస్సు ఎక్కితే చాలు మహిళలంతా లక్షాధికారులు అయిపోయినట్టుగా ఆయన చేస్తున్న ప్రకటనలు విని మహిళలంతా నివ్వెరపోతున్నారని తెలిపారు. 2014-19 మధ్య డ్వాక్రా రుణాల మాఫీ పేరిట మాయ చేసి, చివరికి వడ్డీ సైతం ఎగరగొట్టి, తర్వాత వెన్నుపోటు పొడిచిన రోజులను కూడా మహిళలంతా మరోసారి గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. వైకాపా ఐదేళ్ల కాలంలో చేసిన మంచిని కూడా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

తమ ప్రభుత్వ హయాంలో దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని మొదటి ఏడాది చంద్రబాబు ఎగ్గొట్టారని జగన్ ఆరోపించారు. ఒక్కో ఏడాది ఒక్కో పిల్లాడికి రెండేళ్లకు గాను రూ.30 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.13 వేలే ఇచ్చారని, చాలా మంది పిల్లలకు అది కూడా అందలేదని విమర్శించారు. మొత్తం 87 లక్షల మంది పిల్లలకు ఇవ్వాల్సి ఉంటే, 30 లక్షల మంది పిల్లలకు కోత పెట్టారని ఆరోపించారు.

మహిళల స్వయం సాధికారత కోసం, వారి కాళ్ల మీద వారు నిలబడేలా తాము హామీ ఇచ్చిన విధంగా ఆసరా కింద రూ.25,571 కోట్లు వారి చేతికే అందించామని జగన్ అన్నారు. సున్నా వడ్డీ కింద మరో రూ.5 వేల కోట్లు అదనంగా ఇచ్చామని, ఇది గతంలో ఎప్పుడూ జరగలేదని తెలిపారు. మహిళల స్వయం ఉపాధి కోసం చేయూత కింద ప్రతి ఏటా ఆ అక్కచెల్లెమ్మలకు రూ.18,750 చొప్పున 33,14,901 మందికి రూ.19,189.59 కోట్లు నేరుగా వారి చేతికే ఇచ్చి, అముల్, పీ అండ్ జీ, హిందుస్థాన్ లీవర్, మహీంద్రా, ఐటీసీ లాంటి ప్రఖ్యాత సంస్థలను బ్యాంకులతో అనుసంధానం చేస్తూ, వారి కాళ్లమీద వాళ్లు నిలబడేలా ప్రోత్సహిస్తూ, బ్రహ్మాండంగా అమలు చేశామని చెప్పారు. 

గతంలో ఎన్నడూ లేని విధంగా కాపు నేస్తం కింద 4,62,878 మంది కాపు అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున రూ.2,029 కోట్లు, మేనిఫెస్టోలో పెట్టకపోయినా అగ్రకులాల్లోని పేదలైన అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఈబీసీ నేస్తం కింద మరో 4,95,269 మందికి రూ.1,876 కోట్లు ఇచ్చామని తెలిపారు. 1.05 కోట్ల మంది మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసి, డ్వాక్రా రుణాలపై వారు కట్టాల్సిన వడ్డీని తమ ప్రభుత్వమే భరిస్తూ రూ.4,969 కోట్లు చెల్లించామని తెలిపారు. 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మలకే ఇస్తూ వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేశామని, ఇందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని జగన్ పేర్కొన్నారు. మహిళా సాధికారతలో తమ పరిపాలనా కాలం ఒక స్వర్ణయుగమని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయమని, తమ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన అన్నారు.

కొనసాగుతున్న ఈ పథకాలన్నింటినీ చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి, మహిళలను మళ్లీ పేదరికంలోకి నెట్టి, లక్షలాది కుటుంబాలను దెబ్బతీశారని జగన్ ఆరోపించారు. చేయకూడని ద్రోహం చేస్తూ, పైగా ఇచ్చిన అరకొర బస్సుల్లో ప్రయాణిస్తే లక్షాధికారులు అయిపోతారంటూ మోసపుచ్చే మాటలు మాట్లాడుతున్నారని, చంద్రబాబు చేస్తున్నది మోసం కాదా? దగా కాదా? అని ప్రశ్నించారు. అంతేకాదు, మీరు ఏడాదికి ఇస్తానన్న 3 ఉచిత సిలిండర్ల పథకం కూడా ఈ మాదిరిగానే అఘోరించిందని విమర్శించారు. 

గత ఏడాది మూడు సిలిండర్లకు గాను మీరు ఇచ్చింది ఒక్కటేనని, రాష్ట్రంలో 1.59 కోట్ల కనెక్షన్లు ఉంటే, ఏడాదికి మూడు సిలిండర్లకు గాను రూ.4,100 కోట్లు అవసరం అవుతాయని తెలిపారు. మొదటి ఏడాది ఇచ్చింది ఒక్క సిలిండర్ మాత్రమేనని, అది కూడా అందరికీ ఇవ్వలేదని, ఖర్చు చేసింది కూడా కేవలం రూ.764 కోట్లు మాత్రమేనని, మిగిలిన 2 సిలిండర్లు ఎగ్గొట్టారని ఆరోపించారు. ఇప్పుడు రెండో ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొందని, మూడు సిలిండర్ల కోసం రూ.4,100 కోట్లకు గాను ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.747 కోట్లు మాత్రమేనని విమర్శించారు. ఇది మోసం కాదా? దగా కాదా? అని ప్రశ్నించారు. అందుకే బాబు ష్యూరిటీ... మోసం గ్యారెంటీ కార్యక్రమం వైకాపా నిర్వహిస్తోందని జగన్ అన్నారు. 
Advertisement
YS Jagan
Chandrababu Naidu
Andhra Pradesh
Super Six
Free Bus Scheme
Ammavodi Scheme
YSRCP
TDP
Women Empowerment
AP Politics

More Telugu News