Srilakshmi IAS: ఆ ఐఏఎస్ అధికారిణి వేల కోట్లు లూటీ చేశారు.. అవినీతిలో అనకొండ: భూమన సంచలన వ్యాఖ్యలు

Bhuma Slams Srilakshmi IAS Officer as Corruption Anaconda
  • ఆమె రోజుకు రూ. 1.5 లక్షల విలువైన చీర కడతారని ఆరోపణ
  • తనపై కక్షగట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు
  • టీడీఆర్ బాండ్ల ద్వారా భారీగా దోచుకోవాలని ప్రణాళిక వేశారని ఆరోపణ
వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిణిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమెను 'అవినీతిలో అనకొండ' అంటూ అభివర్ణించిన ఆయన, టీడీఆర్ బాండ్ల విషయంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని సవాల్ విసిరారు. గత రెండేళ్లుగా తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఇప్పుడు బయటపెడుతున్నానని భూమన స్పష్టం చేశారు.

తిరుపతిలో భూమన మాట్లాడుతూ.. గతంలో పనిచేసిన సదరు ఐఏఎస్ అధికారిణికి డబ్బు సంపాదించాలనే ధ్యాస తప్ప నైతిక విలువలు లేవని ఆరోపించారు. ఆమె శాఖకు సంబంధించిన మంత్రులను సైతం ఆమె కనీసం లెక్కచేయలేదని, కిందిస్థాయి అధికారుల పట్ల 'తాటకి'లా వ్యవహరించారని తీవ్ర విమర్శలు చేశారు. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లు వేస్తున్న సమయంలో, టీడీఆర్ బాండ్ల ద్వారా భారీగా దోచుకోవాలని ఆమె ప్రణాళిక వేశారని, అయితే తాము దానిని అడ్డుకున్నామని భూమన వివరించారు.

ఈ విషయం తట్టుకోలేకే, సదరు అధికారిణి నెల్లూరు జిల్లా నేతలకు తప్పుడు సమాచారం అందించి, తాను రూ.2,000 కోట్లు దోచుకున్నానంటూ అబద్ధపు ప్రచారం చేయించారని భూమన ఆరోపించారు. తాను ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్టు నిరూపించినా ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. "ఆమె 35 ఏళ్ల సర్వీసులో ఎక్కడ పనిచేసినా వందల, వేల కోట్లు లూటీ చేశారు. ఆమె అవినీతి గురించి సుప్రీంకోర్టుకు కూడా తెలుసు" అని భూమన వ్యాఖ్యానించారు.

సదరు ఐఏఎస్ అధికారిణి రోజూ ధరించే చీర ఖరీదు రూ.1.5 లక్షలు ఉంటుందని, వేల రూపాయల విలువ చేసే 11 విగ్గులు ఆమె వద్ద ఉన్నాయని భూమన వ్యక్తిగత ఆరోపణలు చేశారు. నీతిగా, నిజాయతీగా ఉన్న తనపై కక్షగట్టి, కుట్రపూరితంగా అసత్య ప్రచారం చేయిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము 21 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి తిరుపతిని అభివృద్ధి చేశామని ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి గుర్తుచేశారు. 

వైసీపీ హయాంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శ్రీలక్ష్మిని లక్ష్యంగా చేసుకుని భూమన ఈ వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు.  
Srilakshmi IAS
Bhuma Karunakar Reddy
IAS officer Srilakshmi
TDR bonds
Tirupati master plan
Corruption allegations
YS Jagan Mohan Reddy
Nellore district
Andhra Pradesh politics
Municipal administration

More Telugu News