తెలంగాణలో వాహనదారులకు షాక్.. ఫ్యాన్సీ నంబర్ల ధరలకు భారీగా రెక్కలు
- ఫ్యాన్సీ నంబర్ల ధర పెంచుతూ తెలంగాణ రవాణాశాఖ నిర్ణయం
- ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనల తర్వాత పూర్తిస్థాయిలో నోటిఫికేషన్
- రూ. 50 వేలుగా ఉన్న 9999 నంబర్ ఇకపై రూ. 1.50 లక్షలు
వాహనదారులు ఫ్యాన్సీ నంబర్‌గా భావించే 9999 నంబర్‌కు ఇప్పటివరకు ఉన్న ప్రాథమిక ధర రూ. 50 వేలు కాగా, దాన్ని ఏకంగా రూ. 1.50 లక్షలకు పెంచారు. వేలంలో దీనిపై ఎవరు ఎక్కువ పాడితే వారికే ఆ నంబర్ కేటాయిస్తారు. అదేవిధంగా, 6666 నంబర్ ప్రాథమిక ధరను రూ. 30 వేల నుంచి రూ. లక్షకు పెంచారు. ఇప్పటివరకు ఫ్యాన్సీ నంబర్ల కోసం ఉన్న ఐదు స్లాబులను రవాణా శాఖ ఏడుకు పెంచింది. ప్రస్తుతం రూ. 50 వేలు, రూ. 30 వేలు, రూ. 20 వేలు, రూ. 10 వేలు, రూ. 5 వేలుగా ఉన్న ఈ స్లాబులను, ఇకపై రూ. 1.50 లక్షలు, రూ. లక్ష, రూ. 50 వేలు, రూ. 40 వేలు, రూ. 30 వేలు, రూ. 20 వేలు, రూ. 6 వేలుగా నిర్ణయించారు.