Vijay Rupani: ఎయిర్ క్రాష్: లండన్ లో ఉన్న భార్యను భారత్ తీసుకొచ్చేందుకు విమానం ఎక్కిన విజయ్ రూపానీ!

Vijay Rupani Flew to London to Bring Wife Back Dies in Air India Crash
  • అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం
  • మాజీ సీఎం విజయ్ రూపానీ పరిస్థితిపై తీవ్ర ఉత్కంఠ!
  • ఆయన బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తున్నట్టు రికార్డుల్లో నమోదు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం (ఏఐ171) టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలిన ఘటన తీవ్ర విషాదం కలిగించింది. ఈ దుర్ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ప్రయాణిస్తున్నట్లు మీడియా పరంగా నిర్ధారణ అయింది. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ విమానం, సమీపంలోని మేఘాని ప్రాంతంలో కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానం నుంచి దట్టమైన నల్లటి పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. సుదూర ప్రయాణానికి సరిపడా ఇంధనం నిండుగా ఉండటంతో, విమానం నేలకూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ మంటల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఎదురవుతోంది.

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ లండన్ లో ఉన్న భార్యను భారత్ తీసుకువచ్చేందుకు ఈ విమానంలోనే లండన్‌కు పయనమయ్యారు. చెక్-ఇన్ పత్రాల ప్రకారం, ఆయన బిజినెస్ క్లాస్‌లో (సీటు నంబర్ 2డి) ప్రయాణించేందుకు మధ్యాహ్నం 12:10 గంటలకు జోన్ 1 నుంచి బోర్డింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన టికెట్ బుకింగ్ రిఫరెన్స్ 6ఎఫ్‌కే2ఎం2 కాగా, ఇ-టికెట్ నంబర్ 0982865207073గా నమోదై ఉంది. విమాన ప్రమాద తీవ్రత కారణంగా, ఇందులోని వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు అత్యంత స్వల్పం అని నిపుణులు చెబుతున్నారు.

సహాయక చర్యలు ముమ్మరం

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించిన ప్రాథమిక వివరాల ప్రకారం, ప్రమాద సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు (కెప్టెన్ సుమీత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్), 10 మంది క్యాబిన్ సిబ్బంది సహా మొత్తం 242 మంది ఉన్నారు. ప్రమాద వార్త అందిన వెంటనే అగ్నిమాపక దళాలు, అంబులెన్సులు, పోలీసులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాంధీనగర్ నుంచి మూడు, వడోదర నుంచి మరో మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి.
Vijay Rupani
Air India crash
Ahmedabad plane crash
Boeing 787 Dreamliner
Gujarat ex CM
AI171
Sumit Sabharwal
Clive Kundar
Air accident India
Sardar Vallabhbhai Patel International Airport

More Telugu News