మరణాన్నైనా ఆహ్వానిస్తాం కానీ పాకిస్థాన్ కు వెళ్లం.. హిందూ శరణార్థుల ఆవేదన

Pakistani Hindu Refugees Refuse Return Amidst Repatriation Fears
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ లోని పాకిస్థానీ పౌరులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసిన విషయం విదితమే. ఈ ప్రకటన ప్రస్తుతం హిందూ శరణార్థుల గుండెల్లో గుబులు రేపుతోంది. మరణాన్ని ఆహ్వానించడానికైనా సిద్ధమే కానీ తమను పాకిస్థాన్ కు మాత్రం తిరిగి పంపొద్దని వేడుకుంటున్నారు. మతపరమైన వేధింపుల కారణంగా పాక్ లో హిందువులు సంతోషంగా జీవించే పరిస్థితి లేదని వాపోతున్నారు.

పాక్ లో జీవించలేక స్వల్పకాలిక వీసాలపై భారత్‌ కు వచ్చామని, ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నామని చెబుతున్నారు. ఆ నరకంలోకి తమను మళ్లీ పంపవద్దని వేడుకుంటున్నారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లా ముల్సాగర్ గ్రామంలోని 'ఏకలవ్య భిల్ బస్తీ'లో తలదాచుకుంటున్న వేలాది మంది పాక్ హిందూ శరణార్థులు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పాకిస్థాన్‌లో మైనారిటీలపై మతపరమైన వేధింపులు పెరుగుతున్నాయని, తిరిగి అక్కడికి వెళ్తే తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇప్పటికే దీర్ఘకాలిక వీసాలు పొందిన పాకిస్థానీ హిందూ పౌరులకు ఈ ఆదేశాలు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, స్వల్పకాలిక వీసాలపై వచ్చిన వారికి మాత్రం ఎలాంటి మినహాయింపు లభించలేదు.

సింధ్ ప్రావిన్స్‌కు చెందిన ఖేతో రామ్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి పహల్గామ్ దాడికి కొన్ని గంటల ముందు భారత్‌కు వచ్చారు. పాక్‌లో తమకున్నదంతా అమ్ముకుని వచ్చామని, అక్కడ నిరంతర వేధింపులు భరించలేకపోయామని ఆయన తెలిపారు. "భారత్‌లో చనిపోవడానికైనా సిద్ధం, కానీ నరకంలాంటి పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లలేం" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని వేడుకున్నారు. బలం అనే మరో శరణార్థి, ఆయన భార్య కూడా తాము తిరిగి పాక్‌కు వెళ్లలేమని, "చావనైనా చస్తాం కానీ, మమ్మల్ని వెనక్కి పంపొద్దు" అని ప్రాధేయపడ్డారు.

పాకిస్థాన్‌లో మతపరమైన మైనారిటీల పరిస్థితి మరింత దిగజారుతోందని, మత దూషణ చట్టాల కింద వారు తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నారని యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలీజియస్ ఫ్రీడం ఇటీవల నివేదిక వెల్లడించిన నేపథ్యంలో, శరణార్థుల భయాలు మరింత పెరిగాయి.

Go Back to Shorts
Pakistani Hindu Refugees
India
Pakistan
Religious Persecution
Kheto Ram
Mul Sagar
Jaisalmer
Visa Issue
Pakistan Minority Rights
USCIRF Report

More Telugu News