Karnataka: అమానుషం... చెట్టుకు కట్టేసి ప్రైవేట్ పార్ట్స్‌లో ఎర్ర చీమలను వదిలి రాక్షసానందం..!

- కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఘటన
- దొంగతనం నెపంతో బాలుడిపై సొంత వర్గానికి చెందినవారే దాష్టీకం
- బట్టలు విప్పి చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టిన వైనం
- ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో వెలుగులోకి ఘటన
కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. దొంగతనం నెపంతో ఓ బాలుడిని అతని సొంత వర్గానికి చెందినవారే దారుణంగా హింసించారు. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
చన్నగిరి తాలూకా నల్లూరు సమీపంలోని అస్తపనహళ్లి గ్రామానికి చెందిన హక్కీ-పిక్కీ గిరిజన వర్గానికి చెందిన బాలుడిని దొంగతనం చేశాడనే అనుమానంతో బట్టలు విప్పి అరెకా చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. అంతటితో ఆగకుండా అతని ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఎర్ర చీమలను వదిలి రాక్షసానందం పొందారు. కొద్దిరోజుల కిందట ఈ ఘటన జరగగా, తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.
దావణగెరె ఎస్పీ ఉమా ప్రశాంత్ చన్నగిరి పోలీసులను అస్తపనహళ్లి గ్రామాన్ని సందర్శించి, పూర్తి వివరాలను సేకరించి, సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని ఆమె వెల్లడించారు.