వైజాగ్ హోటల్‌లో ఎన్నారై మహిళ అనుమానాస్పద మృతి.. హత్యా? ఆత్మహత్యా?

NRI woman died in Visakhapatnam hotel room
  • వైజాగ్‌కే చెందిన వైద్యుడు శ్రీధర్‌తో మృతురాలికి పరిచయం
  • నెల రోజుల క్రితం అమెరికా నుంచి నగరానికి వచ్చి హోటల్‌లో ఉంటున్న శ్రీధర్
  • ఇటీవల విశాఖ వచ్చిన మహిళ.. అతడితోనే హోటల్ గదిలో ఉంటున్న వైనం
  • గురువారం ఆమె ఉరివేసుకున్నట్టు పోలీసులకు శ్రీధర్ ఫిర్యాదు
  • వాంగ్మూలంలో మాత్రం అనారోగ్య కారణాలతో చనిపోయినట్టు చెప్పడంతో అనుమానాలు
విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో ఎన్నారై మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శనివారం ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. సీతమ్మధారకు చెందిన మహిళ (48) అమెరికాలో స్థిరపడ్డారు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నగరానికే చెందిన వైద్యుడు శ్రీధర్ (52) కూడా అమెరికాలోనే స్థిరపడ్డారు. వీరిద్దరి మధ్య స్నేహం ఉన్నట్టు తెలిసింది. 

నెల రోజుల క్రితమే వైజాగ్ వచ్చిన శ్రీధర్ ఓ హోటల్ గదిలో ఉంటున్నాడు. ఓ ప్రైవేటు స్థలం లీజు అగ్రిమెంట్ కోసం ఎన్నారై మహిళ కూడా ఇటీవల విశాఖ వచ్చారు. శ్రీధర్ గదిలోనే ఆమె కూడా ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఆమె హోటల్ గదిలోని బాత్రూంలో షవర్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు శ్రీధర్ ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.

అయితే, బాత్రూంలో ఉరి వేసుకున్నట్టు ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉంటుందని శ్రీధర్ వాంగ్మూలంలో పేర్కొనడం అనుమానాలకు తావిచ్చింది. కాగా, ఈ ఘటనకు ముందు శ్రీధర్ ఫోన్‌లోని మహిళల వీడియోలపై ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. 

అయితే, ఆత్మహత్య ఆనవాళ్లు లేకపోవడంతో హత్య జరిగిందన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఆమె ఒంటిపై దాదాపు రూ. 20 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్టు తెలిసింది. కాగా, సమాచారం అందుకున్న మహిళ భర్త శనివారం వైజాగ్ వచ్చి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక ఆమె మృతిపై నెలకొన్న మిస్టరీ వీడుతుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Crime News
Visakhapatnam
NRI Woman

More Telugu News