క్లీన్ చిట్ వచ్చింది... ఇక దూసుకెళతా: కిరణ్ రాయల్
- ఇటీవల కిరణ్ రాయల్ పై లక్ష్మీరెడ్డి అనే మహిళ సంచలన ఆరోపణలు
- కిరణ్ రాయల్ ను తాత్కాలికంగా పక్కన పెట్టిన జనసేన పార్టీ
- కొన్ని రోజుల కిందట లక్ష్మీరెడ్డి యూటర్న్
- కిరణ్ రాయల్ తో తనకు గొడవలేమీ లేవని వెల్లడి
- సర్దుబాటు జరిగిందని స్పష్టీకరణ
ఇక, తనపై వచ్చిన ఆరోపణలు వీగిపోవడంతో కిరణ్ రాయల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందుకు వచ్చిన ఆయన... తనకు క్లీన్ చిట్ వచ్చిందని, ఇక నేషనల్ హైవేపై దూసుకెళ్లినట్టు దూసుకెళతా అని ఆనందంగా చెప్పారు. ఇప్పటివరకు జరిగిన పరిణామాలన్నీ తన మంచికే జరిగాయని భావిస్తానని అన్నారు. ఎవరు ఎలాంటి వారో తెలిసిందన్నారు.
తనకు, లక్ష్మీ రెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయని, ఆమెను అడ్డంపెట్టుకుని తనను తొక్కేయాలని ప్రయత్నించారని కిరణ్ రాయల్ ఆరోపించారు. ఆమెకు ఆర్థికంగా ఆశచూపారని, ఆమె కొడుకులను కూడా బెదిరించారని వివరించారు. అయితే, ఈ వ్యవహారంలో తాను ఏ తప్పు చేయలేదని కొందరు నమ్మారని, తనకు అది చాలని అన్నారు.
జీవితంలో ఇద్దరికి రుణపడి ఉంటానని... ఒకరు పవన్ కల్యాణ్, రెండు మీడియా అని వెల్లడించారు. నేను ఎలాంటి తప్పుడు పని చేయలేదని తెలిసే పవన్ కల్యాణ్ విచారణ జరపమన్నారు అని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు. ఇక, తనపై కుట్ర చేసిన వాళ్లెవరన్నది ఆధారాలతో సహా పవన్ ముందుంచుతానని తెలిపారు.