లోకనాయకుడు సహా నా పేరుకు ముందు బిరుదులన్నింటినీ తిరస్కరిస్తున్నాను: కమల్ హాసన్
- భారతీయ సినీ రంగంలో కమల్ హాసన్ కు ప్రత్యేక అధ్యాయం
- లోకనాయకుడు సహా అనేక బిరుదులు కమల్ సొంతం
- తాను కళ కంటే ఎప్పుడూ గొప్పవాడ్ని కాదన్న కమల్
- అందుకే ఇకపై తన పేరుకు ముందు బిరుదలు చేర్చవద్దంటూ లేఖ
లోకనాయకుడు, ఇంకా ఇతర బిరుదులతో నన్ను పిలుచుకుంటూ, ఎంతో ప్రేమను ప్రదర్శించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, అయినప్పటికీ ఇకపై బిరుదులను తన పేరు ముందు చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నానని కమల్ హాసన్ స్పష్టం చేశారు. ఎందుకంటే, సినీ రంగంలో తనను తాను నిత్య విద్యార్థిగానే భావిస్తానని, ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటానని తన లేఖలో వినమ్రంగా పేర్కొన్నారు.
సినిమా రంగం అనేది అందరికీ చెందుతుందని, లెక్కలేనంతమంది కళాకారుల సహకార ఫలితమే సినిమా రంగం అని వివరించారు. టెక్నీషియన్లు, ప్రేక్షకులు కూడా సినిమా రంగంలో భాగమేనని.... కళను మించి తాను గొప్పవాడ్నని కళాకారుడు ఎప్పుడూ అనుకోరాదని, అందుకే తాను ఎంత ఎదిగినా కళామతల్లి ముందు ఒదిగి ఉండాలని భావిస్తానని కమల్ వివరించారు.
ఈ క్రమంలో, తాను గొప్పవాడ్ని అని భావించలేనని, అందుకే అన్ని బిరుదులను తిరస్కరిస్తున్నానని స్పష్టం చేశారు. ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న వారందరికీ మరొక్కమారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.