Lucky Bhaskar: దుల్కర్‌ 'లక్కీ భాస్కర్‌', కిరణ్‌ 'క' తొలిరోజు కలెక్షన్లు ఎంతో తెలుసా...!

Do you know the first day collections of Dulquer Lucky Bhaskar and Kiran Ka
షార్ట్స్‌లో చూడండి
మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ నటించిన చిత్రం 'లక్కీ భాస్కర్‌'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ , ఫార్చ్యూన్‌ ఫోర్‌ పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరి నాయికగా నటించిన ఈ చిత్రం ఈ దీపావళికి గురువారం నాడు విడుదలైన సంగతి తెలిసిందే. తొలి ఆట నుంచే ఈ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల ప్రశంసలతో పాటు, విమర్శకుల అభినందలు లభిస్తున్నాయి. 

ఇక దీపావళి సెలవు రోజుల్లో విడుదలైన ఈ చిత్రానికి మంచి ప్రారంభ వసూళ్లు కూడా లభించాయి. ఈ సినిమా మొదటి రోజు వసూళ్ల వివరాలను మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. కలెక్షన్స్‌ను మెన్షన్‌ చేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.12 కోట్ల 7 లక్షల గ్రాస్‌ను సాధించినట్లు తెలిపింది. 

బ్యాంకింగ్‌ సెక్టార్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సాధారణ క్లర్క్‌ గా పనిచేసే ఓ ఉద్యోగి బ్యాంకింగ్‌ రంగంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకుని తన తెలివితేటలతో ఎలా కోట్లకు అధిపతి అయ్యాడు అనే అంశాన్ని దర్శకుడు ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించాడు. మీనాక్షి చౌదరి నాయికగా నటించిన ఈ చిత్రానికి ఫ్యామిలీ ఎమోషన్స్‌ ప్రధాన బలంగా నిలిచాయి. 

ఈ దీపావళికి బరిలో నిలిచిన మరో చిత్రం 'క'. గత కొంతకాలంగా సరైన సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న కిరణ్‌ అబ్బవరం నటించిన ఈ పీరియాడికల్‌ యాక్ష్‌న్‌ థ్రిల్లర్‌ చిత్రానికి సుజీత్‌-సందీప్‌లు దర్శకులు. చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నయన్‌ సారిక నాయికగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

కొత్త కాన్సెప్ట్‌తో ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో రూపొందిన ఈ చిత్రానికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో చివరి ఇరవై నిమిషాలు అందరిని షాకింగ్‌కు గురిచేసే విధంగా సరికొత్తగా ఉందని ఆడియన్స్ అంటున్నారు. ఈ చిత్రంలో కిరణ్‌ అబ్బవరం పోస్ట్‌మ్యాన్‌గా నటించాడు. కాగా ఈ చిత్రం తొలిరోజు వసూళ్లను కూడా అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రం తొలిరోజు రూ. 6 కోట్ల 18 లక్షలు గ్రాస్‌ సాధించినట్లుగా  మేకర్స్‌ తెలిపారు. 
Go Back to Shorts
Lucky Bhaskar
Ka
Dulquer Salmaan
Kiran abbavaram
Cinema
Tollywood

More Telugu News