నోట్లో పాము పెట్టుకుని వీడియో.. కాటేయడంతో యువకుడి మృతి!
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో ఘటన
- పామును నోట్లో పెట్టుకుని సెల్ఫీ వీడియో తీసే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన శివరాజ్
- నోట్లో పాము విషం చిమ్మడంతో చనిపోయినట్లు నిర్ధారణ
స్థానికంగా నివాసముండే మోచి శివరాజ్ (20) అనే యువకుడు పాములను పడుతూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో గురువారం అతను సుమారు రెండు అడుగుల పొడువు ఉన్న నాగుపామును పట్టుకున్నాడు.
అనంతరం ఆ విష నాగును నోట్లో పెట్టుకుని సెల్ఫీ వీడియో కోసం ప్రయత్నించాడు. అయితే, పాము ఆ సమయంలో యువకుడి నోట్లో విషం చిమ్మింది. దాంతో కొంతసేపటికే శివరాజ్ ప్రాణాలొదిలాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.