వృద్ధుల హక్కులకు పెద్దపీట.. ఢిల్లీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు
Advertisement

వృద్ధుల హక్కులకు పెద్దపీట.. ఢిల్లీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు

Delhi High Court Rules Senior Citizens Can Evict Children From Home
  • పోషించని పిల్లలను ఇంటి నుంచి పంపే అధికారం వృద్ధులకు ఉందన్న కోర్టు
  • సీనియర్ సిటిజన్ల చట్టం కింద ఈ అధికారం చెల్లుబాటు అవుతుందని స్పష్టీకరణ
  • వృద్ధుల ప్రశాంత జీవనానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్య
  • గృహ హింస చట్టం, వృద్ధుల సంరక్షణ చట్టంపై కీలక సమన్వయం
వృద్ధ తల్లిదండ్రులను సరిగా చూసుకోకపోయినా, వారిని అవమానించినా తమ సొంత ఇంటి నుంచి పిల్లలను, చట్టపరమైన వారసులను ఖాళీ చేయించే పూర్తి అధికారం వారికి ఉందని ఢిల్లీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం-2007 ప్రకారం ఈ అధికారం చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. అయితే, ఈ అధికారాన్ని వినియోగించుకోవాలంటే బాధితులు జిల్లా కలెక్టర్ లేదా డివిజనల్ కమిషనర్‌ను ఆశ్రయించాలని సూచించింది.

ఓ కుటుంబ వివాదానికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియా ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. పూనం అనే మహిళ తన అత్తింటి వారిపై గృహ హింస చట్టం కింద కేసు పెట్టి, అత్తగారి ఇంట్లో నివాసం ఉండేందుకు హక్కు కల్పించాలని కోరారు. మరోవైపు, తనను సరిగా చూసుకోవడం లేదని ఆరోపిస్తూ కోడలు పూనంను ఇంటి నుంచి పంపించాలని ఆమె అత్త సీనియర్ సిటిజన్ చట్టం కింద డివిజనల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇల్లు ఖాళీ చేయాలన్న కమిషనర్ ఆదేశాలను సవాలు చేస్తూ పూనం హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసును విచారించిన హైకోర్టు, ఢిల్లీ ప్రభుత్వం 2009లో రూపొందించిన నిబంధనలు చట్టబద్ధమైనవేనని తేల్చిచెప్పింది. ఈ నిబంధనల ప్రకారం వృద్ధులు తమ ఆస్తి నుంచి కుమారుడు, కుమార్తె లేదా ఇతర వారసులను (కోడలు సహా) ఖాళీ చేయించవచ్చని పేర్కొంది. పిటిషనర్ పూనం ఉద్యోగం చేస్తూ మంచి ఆదాయం సంపాదిస్తున్నారని, ఆమెకు వేరే ఇల్లు కూడా ఉందని కోర్టు గుర్తించింది.

"భాగస్వామ్య గృహంలో నివసించే హక్కు అపరిమితం కాదు. వృద్ధురాలు తన జీవిత చరమాంకంలో ప్రశాంతంగా జీవించే హక్కుకు భంగం కలిగించకూడదు" అని కోర్టు వ్యాఖ్యానించింది. గృహ హింస చట్టం కింద హక్కులను, సీనియర్ సిటిజన్ చట్టం కింద వృద్ధుల హక్కులను సమన్వయంతో చూడాలని సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకించింది. 
Advertisement
Delhi High Court
Senior Citizen Rights
Parent Eviction Law
Maintenance and Welfare of Parents Act
Elderly Property Rights
Delhi High Court Landmark Judgment

More Telugu News