సాహసమంటే ఇదీ.. ఉత్త చేతులతో చిరుతను ఎదుర్కొన్న అటవీశాఖ ఉద్యోగి.. వీడియో ఇదిగో!
- కశ్మీర్ లోని ఓ గ్రామంలో చిరుత సంచారం
- ఇద్దరు మహిళలను గాయపరిచిన చిరుతపులి
- భయాందోళనలతో అధికారులకు సమాచారం అందించిన గ్రామస్థులు
- చిరుతను బంధించే క్రమంలో గాయపడ్డ ముగ్గురు ఉద్యోగులు
గ్రామస్థులు తెలిపిన సమాచారం ప్రకారం.. బుధవారం గ్రామంలోకి ఓ చిరుత వచ్చింది. వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న చిరుతను చూసి భయాందోళనలకు గురైన జనం వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు గ్రామానికి చేరుకునేలోగా ఆ చిరుత ఇద్దరు మహిళలపై దాడి చేసి గాయపరిచింది. చిరుతను బంధించేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నించగా.. ఓ ఉద్యోగి చేతిని చిరుత నోటకరిచింది. ఓవైపు చిరుత నోట్లో తన చేతిని విడిపించుకునేందుకు ప్రయత్నిస్తూనే దానిని బంధించేందుకు ఆ ఉద్యోగి ప్రయత్నించాడు.
ఇంతలో మిగతా సిబ్బంది, గ్రామస్థులు కలిసి కట్టెలతో చిరుతను కొట్టడంతో చేతిని విడిచిపెట్టింది. ఆ తర్వాత చిరుతకు మత్తుమందు ఇచ్చి బంధించారు. చిరుత దాడిలో గాయపడ్డ అటవీశాఖ సిబ్బందితో పాటు గ్రామస్థులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారన్నారు.