ఉదయగిరి బస్టాండ్ సెంటర్ లో కుర్చీ వేసుకుని కూర్చొని వైసీపీ నేతలకు సవాల్ విసిరిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
- ఉదయగిరికి వస్తే తరిమికొడతామంటూ మేకపాటికి వైసీపీ నేతల వార్నింగ్
- విషయం తెలుసుకుని ఉదయగిరికి వచ్చిన మేకపాటి
- తరిమికొడతామన్న వాళ్లు రావాలంటూ మేకపాటి వార్నింగ్
ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి మేకపాటి ఓటు వేశారంటూ ఆయనను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో, అప్పటి నుంచి వైసీపీ వర్గీయులు ఆయనను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉదయగిరికి వస్తే తరిమికొడతామని హెచ్చరించారు. ఈ ఉదయం కూడా ఉదయగిరి నియోజకవర్గం నుంచి వెళ్లిపో అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేశాయి.
ఈ విషయం తెలుసుకున్న మేకపాటి మర్రిపాడు నుంచి ఉదయగిరికి చేరుకుని మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తనపై అభాండాలు వేసి పార్టీ నుంచి సస్పెండ్ చేశారని మండిపడ్డారు. కేవలం ప్రజల అండతోనే తాను ఎమ్మెల్యేగా గెలుస్తున్నానని చెప్పారు. తనను తరిమికొడతాన్న వారు ఎవరొస్తారో రావాలని సవాల్ విసిరారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.