భూగర్భంలో వైమానిక స్థావరం.. ప్రారంభించిన ఇరాన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భూగర్భంలో వైమానిక స్థావరం.. ప్రారంభించిన ఇరాన్!

Iran reveals an underground air force base
  • శత్రు దేశాల దాడుల నుంచి ఫైటర్ జెట్లను, ఆయుధ సంపత్తిని కాపాడుకునేందుకు నిర్మించిన ఇరాన్
  • బేస్ లో ఫైటర్ జెట్లు, క్రూయిజ్ మిసైళ్లు, బాంబర్లు, డ్రోన్లు భద్రపరిచేందుకు వీలుందన్న ఐఆర్ఎన్ఏ
  • కొండల్లో వందల మీటర్ల లోతులో నిర్మించినట్లు వెల్లడి
శత్రు దేశాల మిసైల్ దాడుల నుంచి తమ ఫైటర్ జెట్లను, ఆయుధ సంపత్తిని కాపాడుకునేందుకు ఇరాన్ ఏకంగా భూగర్భంలో వైమానిక స్థావరాన్నే నిర్మించింది. తమ దేశంలోనే తొలి అండర్ గ్రౌండ్ ఎయిర్ బేస్ వివరాలను తాజాగా ప్రపంచానికి వెల్లడించింది. 

భూగర్భ వైమానిక స్థావరానికి సంబంధించిన ఫొటోలను అధికారిక న్యూస్ ఏజెన్సీ ఐఆర్ఎన్ఏ (ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ) ద్వారా బయటపెట్టింది. అందులో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, ఎఫ్ -4ఈ ఫాంటమ్ 2 ఫైటర్ బాంబర్ కనిపించింది. ఫైటర్ జెట్లు టేకాఫ్ తీసుకుంటున్న వీడియోలను ఇరాన్ స్టేట్ టెలివిజన్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. 

ఈ స్థావరానికి ‘ఒఘాబ్ (డేగ)  44’ అని ఇరాన్ పేరుపెట్టింది. ఇందులో అన్ని రకాల ఫైటర్ జెట్లు, క్రూయిజ్ మిసైళ్లు, బాంబర్లు, డ్రోన్లను భద్రపరిచేందుకు వీలుందని ఐఆర్ఎన్ఏ తెలిపింది. అయితే ఇరాన్ లో ఎయిర్ బేస్ ను ఎక్కడ నిర్మించారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. కొండల్లో వందల మీటర్ల లోతులో నిర్మించినట్లు చెప్పింది.

‘‘ఏదైనా దాడి జరిగితే లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ఎయిర్ బేస్‌లోని జెట్లకు దీర్ఘ-శ్రేణి క్రూయిజ్ క్షిపణులను అమర్చినట్లు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ‘‘ఇజ్రాయెల్ సహా శత్రువులు ఎవరైనా ఇరాన్ పై దాడి చేస్తే.. మా ఎయిర్ బేస్ ల నుంచి వెంటనే ప్రతిస్పందన ఎదుర్కొంటారు. అందులో ఈగల్ 44 కూడా ఉంటుంది’’ అని ఇరాన్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ మొహమ్మద్ బాఘేరీ చెప్పారు. 

‘‘వారం రోజుల కిందట అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో తమ సామర్థ్యాలను చూపెట్టేందుకు అండర్ గ్రౌండ్ ఎయిర్ బేస్ వివరాలను ఇరాన్ బయటపెట్టింది’’ అని అల్ జజీరా న్యూస్ నెట్ వర్క్ వెల్లడించింది. కాగా, మరో అండర్ గ్రౌండ్ బేస్ గురించి గత మే నెలలో ఇరాన్ వివరాలు వెల్లడించింది. వాటిలో డ్రోన్లను భద్రపరచనున్నట్లు తెలిపింది.
Advertisement
Iran
Underground Air Force Base
Eagle 44
USA
Fighter aircraft

More Telugu News