డీజిల్ అయిపోవడంతో ఆగిన అంబులెన్స్.. రోడ్డు మీదే మహిళ ప్రసవం!
- మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో ఘటన
- ఆసుపత్రికి తీసుకెళుతుండగా మధ్యలోనే ఆగిన అంబులెన్స్
- మహిళకు ప్రసవం చేసిన ఆరోగ్య కార్యకర్తలు
రాష్ట్రంలోని పన్నా జిల్లా బనౌలీలోని షానగర్ కు చెందిన రేష్మా నిండు గర్భిణీ.. శుక్రవారం రాత్రి నొప్పులు మొదలవడంతో ఇంట్లో వాళ్లు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. ఫోన్ చేసిన కొద్దిసేపటికి అంబులెన్స్ వచ్చింది. అందులో వచ్చిన ఆరోగ్య కార్యకర్తలు రేష్మను పరీక్షించి కాన్పు జరగొచ్చని తెలిపారు. దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించేందుకు అంబులెన్స్ లో బయల్దేరారు.
అయితే, డీజిల్ అయిపోవడంతో అంబులెన్స్ మార్గమధ్యంలోనే ఆగిపోయింది. రేష్మ ఏ క్షణంలోనైనా ప్రసవించే పరిస్థితిలో ఉండడంతో మరో మార్గంలేక నడిరోడ్డు మీద, చీకట్లోనే ఆరోగ్య కార్యకర్తలు ప్రసవం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.