కంగారూలపై భలే గెలిచారు... రెండో టీ20లో టీమిండియా విన్నర్... సిరీస్ విజేత ఎవరో తేలేది హైదరాబాదులో!

కంగారూలపై భలే గెలిచారు... రెండో టీ20లో టీమిండియా విన్నర్... సిరీస్ విజేత ఎవరో తేలేది హైదరాబాదులో!

Team India beat Australia in 2nd T20
  • నాగపూర్ లో మ్యాచ్
  • మైదానం చిత్తడిగా ఉండడంతో మ్యాచ్ ఆలస్యం
  • 8 ఓవర్లకు కుదించిన అంపైర్లు
  • మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్
  • 8 ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగులు
  • 7.2 ఓవర్లలోనే ఛేదించిన టీమిండియా
సిరీస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. నాగపూర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్, దినేశ్ కార్తీక్ మెరుపులతో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 

రోహిత్ శర్మ 20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 46 పరుగులు చేయగా, దినేశ్ కార్తీక్ 2 బంతుల్లో 10 పరుగులు చేశాడు. టీమిండియా ఈ విజయంతో సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఇక సిరీస్ విజేతను తేల్చే నిర్ణయాత్మక మ్యాచ్ ఈ నెల 25న హైదరాబాదులో జరగనుంది. 

కాగా, ఈ మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. గతరాత్రి కురిసిన వర్షంతో మైదానం చిత్తడిగా ఉండడంతో ఓవర్లను 20 నుంచి 8కి తగ్గించారు. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్ 43 (నాటౌట్), ఫించ్ 31 పరుగులు చేశారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. 

అనంతరం లక్ష్యఛేదనను టీమిండియా ధాటిగా ఆరంభించింది. తొలి ఓవర్లోనే 20 పరుగులు సాధించి తన ఉద్దేశాన్ని చాటింది. కేఎల్ రాహుల్ 10, కోహ్లీ 11, పాండ్యా 9 పరుగులు చేశారు. ఆఖర్లో భారత్ విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం కాగా, తొలి బంతిని సిక్స్, రెండో బంతిని ఫోర్ కొట్టిన దినేశ్ కార్తీక్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3 వికెట్లు తీశాడు.
Team India
Australia
2nd T20
Nagpur

More Telugu News