కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన హీరో అజిత్ అభిమానులు
- రాజకీయ పార్టీని ప్రారంభించిన 38 జిల్లాల అభిమాన సంఘాల నాయకులు
- తమిళగ మక్కల్ కళగం (టీఎంకే)గా నామకరణం
- పసుపు, తెలుపు, ఎరుపు రంగుల కలయికతో పార్టీ జెండా
తమిళ సినీ రంగంలో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న అజిత్ అభిమానులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కళ్లకురిచి జిల్లా ఉళుందూరుపేట సమీపంలో 38 జిల్లాలకు చెందిన అభిమాన సంఘాల నాయకులు ఒక్కటై ‘తమిళగ మక్కల్ కళగం’ (TMK) పేరిట నూతన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రారంభించారు. పసుపు, తెలుపు, ఎరుపు రంగుల కలయికతో రెండు చిరుతల బొమ్మలతో రూపొందించిన పార్టీ జెండాను వారు ఆవిష్కరించారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని అజిత్ గతంలోనే స్పష్టం చేసినప్పటికీ... తమిళనాడు రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన అభిమాన బలాన్ని నిలబెట్టుకోవడానికే ఈ వేదికను నిర్మించినట్లు పార్టీ ప్రతినిధులు తెలిపారు.
నటుడు అజిత్ ప్రమేయం లేకుండానే సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం లక్ష్యంగా తామే స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ నిర్వాహకులు స్పష్టం చేశారు. ఆభిత్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, రామ్ కుమార్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఈ నూతన కమిటీ, తమ ప్రియతమ నటుడు అజిత్ కోసం పార్టీ 'రాష్ట్ర ప్రధాన కార్యదర్శి' అత్యున్నత హోదాను ఖాళీగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఈ బాధ్యతలను అజిత్ నేరుగా వచ్చి స్వీకరించాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.