ట్విట్టర్ పిట్టకు నిన్న మెట్ పల్లిలో చెరుకు రైతుల సెగ, నేడు సిరిసిల్లలో వీఆర్ఏల సెగ తగిలింది: రేవంత్ రెడ్డి
- నేడు సిరిసిల్ల జిల్లాకు వచ్చిన కేటీఆర్
- కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష
- కాన్వాయ్ ను అడ్డుకున్న వీఆర్ఏలు
- కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
- ఇక తండ్రీకొడుకులు బయట తిరిగే పరిస్థితిలేదన్న రేవంత్
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు గత రెండ్రోజులుగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఇవాళ మంత్రి కేటీఆర్ ఓ సమీక్ష నిమిత్తం సిరిసిల్ల కలెక్టరేట్ కు వచ్చారు. సమీక్ష అనంతరం ఆయన కాన్వాయ్ కలెక్టరేట్ నుంచి బయటికి వెళుతుండగా, 50 మంది వీఆర్ఏలు ఒక్కసారిగా కాన్వాయ్ ముందుకు దూసుకొచ్చారు. తమను విధుల్లోకి తీసుకోవాలని, పేస్కేల్ పదోన్నతులు కల్పించాలని వారు నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకోగా పోలీసులు రంగప్రవేశం చేశారు. కేటీఆర్ కాన్వాయ్ ముందు వీఆర్ఏలు బైఠాయించే ప్రయత్నం చేయగా, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు పలువురు వీఆర్ఏలను అరెస్ట్ చేశారు.