కేన్స్ లో పూజా హెగ్డేకి చేదు అనుభవం... ఏం జరిగిందంటే...!
- కేన్స్ లో కొనసాగుతున్న ఫిలిం ఫెస్టివల్
- రెడ్ కార్పెట్ పై పూజా హెగ్డే హొయలు
- కేన్స్ లో ఉత్త చేతులతో అడుగుపెట్టిన పూజా
- ఆమె బ్యాగులు పోయిన వైనం
"మేం అన్నీ పోగొట్టుకున్నాం. ఫ్యాషన్ దుస్తులు, మేకప్ కిట్లు ఏవీ లేకుండా పోయాయి. కేన్స్ లో దిగామో లేదో మాపై బండ పడినట్టు అయింది. బాధపడేందుకు కూడా సమయంలేని పరిస్థితి. వెంటనే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ వాకింగ్ కు సిద్ధం కావాల్సి ఉంది. ఈ పరిణామంతో నాకంటే మా మేనేజర్ ఎక్కువగా ఆందోళనకు గురయ్యారు. నేనైతే... జరిగిందేదో జరిగిపోయింది అనుకున్నాను. అయితే నాతో పాటే కొన్ని ఒరిజినల్ నగలను ఉంచుకోవడం ఊరట కలిగించే అంశం. దాంతో కేన్స్ లోనే దుస్తులు తెప్పించుకుని మేనేజ్ చేశాను.
ఈ సందర్భంగా నా టీమ్ కనీసం భోజనం కూడా చేయలేదు. నేను రెడ్ కార్పెట్ వాకింగ్ పూర్తి చేసేవరకు వాళ్లు పచ్చి మంచినీళ్లు ముట్టలేదు. అన్నీ పోయాయని తెలియగానే వాళ్లు హుటాహుటీన వెళ్లి దుస్తులు, మేకప్ సామాన్లు, కొత్త హెయిర్ ప్రొడక్టులు తీసుకువచ్చి నన్ను సిద్ధం చేశారు. నేనైతే ఆ రోజు తిండి తినేసరికి రాత్రి వేళైంది. ఓవైపు నా హెయిర్ స్టయిలిస్ట్ కి ఫుడ్ పాయిజనింగ్ కావడం మరో బాధాకరమైన అంశం. అయినప్పటికీ కేన్స్ రెడ్ కార్పెట్ మీద నేను అందంగా కనిపించేందుకు వారు ఎంతో శ్రమించారు. నేను కేన్స్ రెడ్ కార్పెట్ పై అడుగుపెట్టానంటే అది వాళ్ల వల్లే" అని పూజా హెగ్డే వివరించింది.