కేంద్రం కీలక నిర్ణయం.. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టం పరిధి కుదింపు
- ఈశాన్య రాష్ట్రాల్లో ఏళ్ల తరబడి అమలులో ఏఎఫ్ఎస్‌పీఏ
- ఈ చట్టంతో సైనిక బలగాలకు విశేష అధికారాలు
- ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొందని ప్రకటించిన అమిత్ షా
ఈశాన్య రాష్ట్రాల్లో చాలా కాలం కిందట అమల్లోకి వచ్చిన ఈ చట్టంతో సైనిక బలగాలకు ప్రత్యేక అధికారాలు దఖలు పడ్డాయి. ఈ చట్టం ఆసరాతో ఈ రాష్ట్రాల్లోని ఏ ప్రాంతంలో అయినా, ఏ వ్యక్తిని అయినా ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే అదుపులోకి తీసుకునే అధికారం సైనిక బలగాలకు దక్కింది. ఈ దిశగా సైనిక బలగాలను ప్రశ్నించే అధికారం ఏ ఒక్కరికీ లేకుండా పోయింది. ఈ చట్టం ఎత్తివేతకు ఈ రాష్ట్రాల్లోని సంఘాలు పలు ఆందోళనలు కూడా చేపట్టాయి.
తమ ప్రభుత్వం తీసుకున్న పకడ్బందీ చర్యల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో తిరిగి శాంతి నెలకొందని, ఈ కారణంగానే ఈ చట్టం అమలు అయ్యే ప్రాంతాలను కుదిస్తున్నామని అమిత్ షా అభిప్రాయపడ్డారు. ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు దారుల అణచివేత కోసం ఈ చట్టాన్ని గత ప్రభుత్వాలు అమలు చేశాయని ఆయన వ్యాఖ్యానించారు.