మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం.. 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పై నిలిచిపోయిన ప్రధాని.. ఫొటోలు ఇవిగో!

Security laps in PM Modis Punjab tour
  •  జాతీయ అమరవీరుల స్మారకం ఉన్న హుస్సేనివాలకు వెళ్లాల్సిన ప్రధాని  
  • రోడ్డును నిర్బంధించిన నిరసనకారులు
  • తిరిగి ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయిన మోదీ కాన్వాయ్
  • భద్రతా వైఫల్యాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర హోంశాఖ
  • పూర్తి నివేదిక ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వానికి ఆదేశం
భారత ప్రధాని మోదీకి కనీవినీ ఎరుగని భద్రత ఉంటుంది. ఆయన ఎక్కడ పర్యటనకు వెళ్లినా వేలాది మంది సాయుధబలగాలు ఆయనకు భద్రత కల్పిస్తుంటాయి. అయితే ఈరోజు ఆయన పంజాబ్ పర్యటనలో తీవ్ర భద్రతా వైఫల్యం కనిపించింది. ఆయన ప్రయాణిస్తున్న సమయంలో నిరసనకారులు రోడ్డును నిర్బంధించారు. దీంతో మోదీ కాన్వాయ్ ఒక ఫ్లైఓవర్ పై 15 నుంచి 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. దాంతో మోదీ అక్కడే కారులో ఉండిపోయారు. ఆ తర్వాత మోదీ కాన్వాయ్ తిరిగి వెనక్కి వెళ్లిపోయింది.

ఈ భద్రతా వైఫల్యాన్ని కేంద్ర హోంశాఖ చాలా సీరియస్ గా తీసుకుంది. దీనిపై తక్షణమే నివేదికను ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే, పంజాబ్ లోని జాతీయ అమరవీరుల స్మారకం ఉన్న హుస్సేనివాలకు మోదీ వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఆ ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలోని ఫ్లైఓవర్ వరకు ప్రధాని కాన్వాయ్ చేరుకుంది.

అయితే మోదీ కాన్వాయ్ ను అక్కడ నిరసనకారులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన మోదీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటనే కాన్వాయ్ ని ఆపేశారు. దీంతో ఫ్లైఓవర్ పై కారులోనే మోదీ వుండిపోయారు. ఇది ప్రధాని భద్రతకు సంబంధించి అతిపెద్ద వైఫల్యమని కేంద్ర హోంశాఖ వ్యాఖ్యానించింది.

వాతావరణం సరిగా లేని కారణం వల్ల జాతీయ అమరవీరుల స్మారకం వద్దకు వెళ్లే ప్రయాణానికి సంబంధించిన ప్లాన్ లో మార్పులు చేశామని... రోడ్డు మార్గం గుండా అక్కడకు వెళ్లేందుకు ప్లాన్ మారిందని... అది 2 గంటల రోడ్డు ప్రయాణమని కేంద్ర హోంశాఖ తెలిపింది.

భద్రతా ఏర్పాట్లన్నీ సక్రమంగా ఉన్నాయంటూ పంజాబ్ డీజీపీ నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే ప్రధాని కాన్వాయ్ బయల్దేరిందని చెప్పింది. రోడ్డు మార్గంలో ప్రధాని ప్రయాణిస్తున్నారని తెలిసినా పంజాబ్ ప్రభుత్వం అదనపు సెక్యూరిటీ ఏర్పాట్లను చేయలేదని తెలిపింది. ప్రయాణానికి విఘాతం కలిగిన నేపథ్యంలో మోదీ కాన్వాయ్ భటిండా ఎయిర్ పోర్టుకు తిరిగి వచ్చిందని వెల్లడించింది.

ఈ భద్రతా వైఫల్యాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తున్నామని... పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించామని పేర్కొంది. తప్పిదం ఎక్కడ జరిగిందో గుర్తించి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించామని తెలిపింది. మరోవైపు ఫిరోజ్ పూర్ లో జరగాల్సిన ప్రధాని ర్యాలీ కూడా రద్దయింది. వాతావరణ కారణాల వల్ల ర్యాలీ రద్దయినట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించడం గమనార్హం.
Go Back to Shorts
Modi
BJP
Punjab
Security Lapse
MHA

More Telugu News