త్వరలోనే ఇండియాలో నాలుగు వ్యాక్సిన్లు... ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకోవచ్చన్న ఎయిమ్స్ చీఫ్!

Vaccine Choice is up to People says AIIMS Chief
  • వ్యాక్సిన్ డ్రైవ్ మరింత వేగవంతం
  • ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రం ఒకటే వ్యాక్సిన్
  • ఆరు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు
  • మరిన్ని టీకాలు పంపుతామన్న రణదీప్ గులేరియా
అతి త్వరలో ఇండియాలో మూడు నుంచి నాలుగు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని, ఎవరికి ఏది కావాలో నిర్ణయించుకునే సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఢిల్లీ చీఫ్ రణదీప్ గులేరియా వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ డ్రైవ్ ను ఇండియాలో మరింత వేగవంతం చేయాలని ఇప్పటికే నిర్ణయించామని పేర్కొన్న ఆయన, ప్రైవేటు ఆసుపత్రుల్లో వివిధ రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని, ప్రభుత్వం మాత్రం ఒకటే వ్యాక్సిన్ ను లబ్దిదారులకు అందిస్తుందని తెలిపారు.

ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించి, మరిన్ని టీకా వేరియంట్లు అందుబాటులోకి వచ్చిన తరువాత, పరోక్షంగానైనా తమకు నచ్చిన కంపెనీకి చెందిన టీకాను తీసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అయితే, ఒక వ్యాక్సిన్ కేంద్రంలో ఒకే వేరియంట్ లభిస్తుందని, కావాల్సిన వ్యాక్సిన్ ఎక్కడుందో తెలుసుకుని వెళ్లాల్సి వుంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఆరు రాష్ట్రాల పరిధిలో కొత్త కరోనా కేసుల సంఖ్య చాలా అధికంగా వుందని గుర్తు చేసిన ఆయన, టీకా పంపిణీని అత్యవసరంగా విస్తృతం చేయాలని అభిప్రాయపడ్డారు. ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇస్తుంటే, క్రమంగా కరోనా అంతరించి పోతుందని వ్యాఖ్యానించిన ఆయన, కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు మరిన్ని వయల్స్ పంపుతామని అన్నారు. వ్యాక్సిన్ ధర కూడా ప్రజలందరికీ అందుబాటులోనే ఉంటుందని, ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను కేంద్రం ఇప్పటికే విడుదల చేసిందని తెలిపారు.

ఇదిలావుండగా, ఇప్పటివరకూ ఇండియాలో సీరమ్ తయారు చేసిన కొవీషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ ను మాత్రమే పంపిణీ చేస్తున్నారు. మొత్తం వ్యాక్సిన్ పొందిన వారిలో కేవలం 11 శాతంగా మాత్రమే కొవాగ్జిన్ తీసుకున్న వారు ఉన్నారు. ఈ శాతాన్ని మరింతగా పెంచుతామని, కొవాగ్జిన్ మూడొో దశ ట్రయల్స్ ఫలితాలు వెల్లడికాగానే మరిన్ని డోస్ లు అందుబాటులోకి వస్తాయని గులేరియా వ్యాఖ్యానించారు.

Go Back to Shorts
AIIMS
Ranadeep Guleria
Corona Virus
Vaccine

More Telugu News