జీవన్ రెడ్డి చరిత్ర, ఆయన వెనుక ఉన్న మచ్చలన్నీ నాకు తెలుసు: రేవంత్ రెడ్డి

Revanth Reddy lashes out at Jeevan Reddy
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం
  • పాపాల భైరవుడు అధికారంలోకి రావాలని జీవన్ రెడ్డి అంటున్నారని ఆగ్రహం
  • 14 సార్లు బీఫామ్ ఇస్తే మోసం చేసి వెళ్లారని ఆగ్రహం
జగిత్యాల సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి చరిత్ర, ఆయన వెనుక ఉన్న మచ్చలన్నీ తనకు తెలుసని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలనలో రైతు ఉత్సవాల పేరుతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్‌పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సభా వేదిక నుంచి ఆయన రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేశారు.

అనంతరం మాట్లాడుతూ, "ప్రజా పాలన పోవాలి, పాపాల భైరవుడు అధికారంలోకి రావాలి" అని ఒక పెద్దమనిషి అంటున్నారని, ఫామ్ హౌస్‌లో పడుకునే పాపాల భైరవుడు మళ్లీ ఎందుకు రావాలని ప్రశ్నించారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు జెండా మోస్తే అధికారంలోకి వచ్చామని, మరి పాపాల భైరవుడు అధికారంలోకి ఎందుకు రావాలో పార్టీ మారుతున్న పెద్ద మనిషి చెప్పాలని అన్నారు.

నాలుగు దశాబ్దాలకు పైగా పార్టీలో ఉండి, తన కుటుంబానికి ఎన్నో పదవులు తీసుకున్నారని జీవన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 14సార్లు బీఫామ్ ఇస్తే ఇప్పుడు మోసం చేసి వెళ్లిపోయారని విమర్శించారు. ఓడిపోయినప్పటికీ ఎన్నోసార్లు పదవులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఆయనను గౌరవించిందని అన్నారు. ఏడాది పాటు పదవి లేకపోయేసరికి జీవన్ రెడ్డి కార్యకర్తల గుండెలమీద తన్ని శత్రువు పంచన చేరారని మండిపడ్డారు.

ఈ ప్రజాప్రభుత్వం పోవాలని జీవన్ రెడ్డి ఎందుకు పిలుపునిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. ఒక వ్యక్తికి పదవి రాకుంటే ప్రభుత్వం పోవాలా అని మండిపడ్డారు. నేరెళ్లలో ఇసుక లారీలతో తొక్కించినందుకు, వాస్తు బాగా లేదని బాగున్న సచివాలయాన్ని కూల్చినందుకు, కుటుంబంలో అందరూ ఫామ్ హౌస్ కట్టుకున్నందుకు, పేదలు కట్టుకోవడానికి ఉపయోగపడని బతుకమ్మ చీరలు పంచినందుకు పాపాల భైరవుడు మళ్లీ అధికారంలోకి రావాలా అని నిలదీశారు.

"కేసీఆర్, నీకు ప్రతిపక్ష హోదా కూడా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటాను. కార్యకర్తల సాక్షిగా ఇదే నా సవాల్. 2029లో నువ్వో, నేనే తేల్చుకుందాం" అని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ పోతున్నామని అన్నారు. పేదలకు సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన గతంలో ఎవరికీ రాలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.
Go Back to Shorts
Revanth Reddy lashes out at Jeevan Reddy
Revanth Reddy at Medigadda

More Telugu News