కరోనా కాలర్ ట్యూన్ పోయింది.. వ్యాక్సిన్ ట్యూన్ వచ్చింది!
- కరోనా టీకాలపై అవగాహన కల్పించేందుకు కేంద్రం నిర్ణయం
- దేశీయ వ్యాక్సిన్లు సురక్షితమని ప్రచారం
- వదంతులు నమ్మొద్దని జనానికి హితవు
ఇకపై, ఆ కాలర్ ట్యూన్ లు బందైపోనున్నాయి. ఆగండాగండి.. పూర్తిగా బంద్ అయిపోతోందనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే.. దానికి బదులుగా ఇంకో కొత్త కాలర్ ట్యూన్ రాబోతోంది. ఏంటో తెలుసా..? శుక్రవారం నుంచి కరోనా వ్యాక్సిన్లు వేయనున్నారు కదా.. అదిగో, దానిపైనే మనకు ఫోన్ లో కొత్త కాలర్ ట్యూన్ స్వాగతం చెప్పనుంది. కరోనా టీకాలపై జనానికి అవగాహన కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త కాలర్ ట్యూన్ ను వినిపించనుంది.
‘‘కరోనా అంతానికి టీకా రూపంలో కొత్త సంవత్సరం ఓ కొత్త వెలుగును తీసుకొచ్చింది. దేశంలో తయారైన వ్యాక్సిన్లు సురక్షితమైనవి. ప్రభావవంతమైనవి. కరోనాను ఎదుర్కొనేందుకు వాటి నుంచి రోగ నిరోధక శక్తి వస్తుంది. మన దేశంలో తయారైన వ్యాక్సిన్లపై నమ్మకం ఉంచండి. మీ వంతు వచ్చినప్పుడు తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోండి. లేనిపోని వదంతులను నమ్మకండి’’ అంటూ కొత్త కాలర్ ట్యూన్ సాగుతుంది.