వాజ్‌పేయి చెప్పాకే తెలిసింది.. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకపోవడానికి కారణం అదే!: లక్ష్మీపార్వతి
- ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారంపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
- ఆయనకు అవార్డు రాకపోవడానికి తానే కారణమని వెల్లడి
- పురస్కారాన్ని తాను అందుకోవడం కుటుంబానికి ఇష్టం లేదని ఆరోపణ
- ఈ విషయాన్ని మాజీ ప్రధాని వాజ్‌పేయి తనతో చెప్పారని వెల్లడి
- భారతరత్న తీర్మానం చేసి టీడీపీ చెత్తబుట్టలో వేస్తోందని విమర్శ
లక్ష్మీపార్వతి కథనం ప్రకారం.. "ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం నేను ఎంతో ప్రయత్నించాను. ప్రధానులుగా ఉన్న దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌లను కలిశాను. ఇద్దరూ తప్పకుండా చేద్దామని మాటిచ్చారు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత వాజ్‌పేయి గారిని కలిసినప్పుడు ఆయన అసలు సత్యం చెప్పారు. ‘మీరు ఎంత ప్రయత్నించినా ఎన్టీఆర్‌కు భారతరత్న రాదు. దానికి కారణం మీరే. ఆయనకు ఇచ్చే పురస్కారాన్ని మీరు అందుకోవడం ఆయన కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. అందుకే వారు అడ్డుకుంటున్నారు’ అని వాజ్‌పేయి గారు నాతో స్పష్టంగా చెప్పారు" అని లక్ష్మీపార్వతి వివరించారు. అప్పటివరకు తాను ఎంతో అమాయకంగా అందరినీ కలిశానని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ విషయంలో టీడీపీ కేవలం నాటకం ఆడుతోందని ఆమె తీవ్రంగా ఆరోపించారు. ప్రతీసారి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేయడం, ఆ తర్వాత దాన్ని చెత్తబుట్టలో పడేయడం టీడీపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం కోటి సంతకాలు సేకరించి అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్‌కు సమర్పించానని, తన తండ్రికి పురస్కారం కోసం కృషి చేయాలని అప్పట్లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న హరికృష్ణను కూడా కోరానని లక్ష్మీపార్వతి గుర్తుచేసుకున్నారు.