Bhuma Nagireddy: తండ్రి భూమా పంచాయతీ... కుమార్తె అఖిలప్రియ కిరికిరి... పోలీసుల రిమాండ్ రిపోర్ట్!

Bhuma Akhilapriya Remand Report Details
  • 2016లో భూములు కొనుగోలు చేసిన ప్రవీణ్ రావు
  • భూమా నాగిరెడ్డి పంచాయతీ తరువాత పెరిగిన ధరలు
  • వాటా కోసం ఒత్తిడి పెంచిన అఖిలప్రియ
  • బయట ఉంటే సాక్ష్యాల తారుమారు
  • రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు
దాదాపు ఐదేళ్ల క్రితం తన తండ్రి భూమా నాగిరెడ్డి చేసిన పంచాయతీపై ఆయన మరణం తరువాత కుమార్తె అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ పెట్టిన కిరికిరి కారణంగానే హఫీజ్ పేట భూముల వ్యవహారం తిరిగి తెరపైకి వచ్చిందని, అదే ప్రవీణ్ రావు సహా ముగ్గురి కిడ్నాప్ కు కారణమని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుపుతూ, అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకుని ఉండకపోతే అనర్థాలు జరిగేవని అభిప్రాయపడ్డారు.

ప్రవీణ్ రావు 2016లో హఫీజ్ పేటలో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని, అప్పట్లో ఆ భూమిపై ఉన్న వివాదాన్ని భూమా నాగిరెడ్డి తదితరులు పరిష్కరించగా, నిర్ణయించుకున్న మొత్తాన్ని ప్రవీణ్ రావు చెల్లించాడని పోలీసులు వెల్లడించారు. ఆపై భూముల ధరలు పెరుగగా, అందులో వాటా లేదా మరింత మొత్తం కావాలని అఖిలప్రియ దంపతులు డిమాండ్ చేయడమే వివాదానికి మొదలని ప్రస్తావించారు. వారు ప్రవీణ్ రావుపై ఒత్తిడి తేవడం ప్రారంభించారని, అందులో భాగంగానే మంగళవారం రాత్రి కిడ్నాప్ జరిగిందని, ఇందుకోసం ముగ్గురితో డీల్ కుదుర్చుకున్నారని తెలిపారు.

అంతకుముందు బాధితులను చిలుకూరులో నిర్బంధించి, కర్రలతో దాడి చేయడమే కాకుండా, ఖాళీగా ఉన్న బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకున్నారని ప్రస్తావించారు. కిడ్నాప్ వార్త బహిర్గతమై, మీడియాలో ప్రముఖంగా రావడంతోనే అప్రమత్తమైన అఖిలప్రియ టీమ్ వారిని విడిచి పెట్టి వెళ్లిపోయారని తెలిపారు. అఖిలప్రియ కుటుంబానికి రాజకీయంగా పలుకుబడి వున్నందున అమె బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని తమ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
Bhuma Nagireddy
Police
Bhuma Akhila Priya

More Telugu News