పదేళ్లకే బిడ్డకు జన్మనిచ్చిన కొలంబియా బాలిక
- చిన్నారిపై లైంగిక దాడి
- వైద్య సంరక్షణ కేంద్రంలో బాలిక, బిడ్డ
- తనపై జరిగిన దారుణం గురించి చెప్పలేకపోతోన్న బాలిక
- బిడ్డకు తండ్రి ఎవరన్న విషయాన్ని కూడా వివరించలేకపోతోన్న వైనం
ఆ బాలికకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ఆమెపై లైంగిక దాడి ప్రారంభమైనట్లు అధికారులు భావిస్తున్నారు. ఆ బాలిక బిడ్డకు జన్మనిచ్చిన నెల రోజులకు ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చింది. ఆమెను, ఆమె బిడ్డను ప్రస్తుతం ఇబాకో నగరంలోని వైద్య సంరక్షణ కేంద్రంలో ఉంచారు.
ఈ ఘటనపై కొలంబియా వ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. తనపై జరిగిన దారుణం గురించి ఆ బాలిక చెప్పలేకపోతోంది. తన బిడ్డకు తండ్రి ఎవరన్న విషయాన్ని కూడా వివరించలేకపోతోంది. ఆ బాలిక బిడ్డకు జన్మనిచ్చిన విషయం ఆలస్యంగా వెలుగు చూసిందని ఆ ప్రాంత గవర్నర్ రికార్డో ఒరోజ్కో తెలిపారు.
దీనిపై కేసు నమోదు చేశామని, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డ వారు ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అనుమానిస్తున్నామని తెలిపారు. ఆ బాలిక సవతి తండ్రి(43), పొలాల్లో పని చేసే మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.