దేశంలో తొలిసారి విమానయాన సిబ్బంది కరోనాతో మృతి
- చెన్నైలో ఇండిగో ఇంజనీర్ మృతి
- ప్రకటించిన ఇండిగో సంస్థ
- ఆయన వివరాలు వెల్లడించని ఇండిగో
అతడికి దాదాపు 50 ఏళ్లు ఉంటాయి. ఆ విమానయాన సంస్థలో అతడు 2006 నుంచి పనిచేస్తున్నాడు. ఉద్యోగం నిమిత్తం చెన్నైలోనే ఉంటున్నాడు. 'మా విమానయాన సంస్థలో పనిచేస్తోన్న ఓ వ్యక్తి చెన్నైలో కొవిడ్-19తో మృతి చెందినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం' అని ఇండిగో ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.
విమానయన సంస్థకు చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందడం దేశంలో ఇదే మొదటిసారి. 'ఇండిగో సిబ్బంది అందరికీ ఇది చాలా బాధ కలిగించే విషయం. ఈ బాధాకర సమయంలో ఆయన కుటుంబానికి అండగా నిలబడతాం. ఆయన కుటుంబం వివరాలు తెలపకుండా గోప్యతను పాటిస్తాం' అని ఇండిగో ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, దేశంలో కరోనా బాధితుల సంఖ్య 8,356కు చేరింది. మృతుల సంఖ్య 273కి పెరిగింది.